Mokshada: తండ్రి సక్సెస్ కి కూతురు సపోర్ట్.. ‘ఇరుముడి’తో మోక్షదకు క్రేజ్!

Mokshada

Mokshada: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో రవితేజతో పాటు ఆయన కుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌లో మాస్ మహారాజా కుమార్తె మోక్షద భూపతిరాజు పోషించిన కీలక బాధ్యత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మోక్షద ‘ఇరుముడి’కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించినట్లు సినీ వర్గాల సమాచారం. అయితే ఆమె పాత్ర కేవలం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానే పరిమితం కాలేదని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను సెట్ చేయడం, నిర్మాణ ప్రక్రియను దగ్గరగా పరిశీలించడం వంటి అంశాల్లోనూ ఆమె కీలకంగా వ్యవహరించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ స్టోరీ మాస్ మహారాజా ఓకే చేయడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని సమాచారం. గతంలోనే రవితేజ తన కుమార్తెను సినీ నిర్మాణ రంగంలోకి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి.

తండ్రి రవితేజ నుంచి నిర్మాణ రంగంలోని మెళకువలను నేర్చుకుంటూ మోక్షద తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రవితేజ సినిమాలకు సంబంధించిన నిర్మాణ వ్యవహారాల్లోనూ ఆమె కీలకంగా భాగస్వామి కానున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే భవిష్యత్ ప్రాజెక్టులపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ‘ఇరుముడి’ విడుదలైన తర్వాత మోక్షద పేరు సోషల్ మీడియాలో కూడా చర్చకు వస్తోంది. సినిమాకు వచ్చిన స్పందన నేపథ్యంలో ఆమెకు క్రెడిట్ ఇవ్వాలంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు. తాజాగా రవితేజ కుమార్తె మోక్షదకు ‘ఇరుముడి’లో ఆమె పోషించిన పాత్రకు తగిన గుర్తింపు దక్కాలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రవితేజ కుమారుడు మహాధన్ కూడా సినీ రంగంలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.