
Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్. ‘నువ్వు నాకు నచ్చావు’, ‘మల్లేశ్వరి’ వంటి ఆల్‌టైమ్ క్లాసిక్స్ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘నారాయణమ్మ’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో వెంకటేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్లో వెంకీ మామ తనదైన మార్కు కామెడీ టైమింగ్‌తో తన స్పీచ్‌ను స్టార్ట్ చేశారు. “నాకు రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడటం రాదని మీకు తెలిసిందే. గత 40 ఏళ్లుగా ఇదే లూప్‌లో బండి నడుస్తోంది” అంటూ నవ్వులు పూయించారు. అనంతరం త్రివిక్రమ్‌తో సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
“నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు త్రివిక్రమ్‌తో కలిసి పనిచేశాను. ఆ రోజుల్లో పెళ్లికాని ప్రసాద్ లాంటి క్యారెక్టర్లు వర్కవుట్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి, పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. మరి ఇప్పుడు ఎలాంటి కథ చేయాలి అనే విషయంలో మాపై విపరీతమైన ఒత్తిడి ఉండేది. అలాంటి సమయంలో త్రివిక్రమ్ అదిరిపోయే స్క్రిప్ట్‌తో వచ్చాడు. ఊహించని ట్విస్టులు, ఎమోషన్స్, మాస్ యాక్షన్, సరికొత్త ట్రీట్మెంట్తో ఈ కథ సిద్ధమైంది” అని వెంకటేష్ స్పష్టం చేశారు. ఈ సినిమాలో తన పాత్ర, కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ వెంకటేష్ వేదికపై నవ్వుల జల్లు కురిపించారు. “ఇది మామూలు కుటుంబం కాదండీ.. వేరే లెవెల్ ఆదర్శ కుటుంబం! ఆవిడేమో నిత్యం అప్పులు చేస్తూ ఉంటుంది, నేనేమో వంటింట్లో కూర్చుని పప్పు చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో వాళ్లేమో బయటకు వెళ్లి ఎవరికి వారు ప్రేమాయణాలు నడిపిస్తుంటారు. అలాంటి చిత్రవిచిత్రమైన ఫ్యామిలీ మధ్యలో నేను, నా పాత్ర ‘చిట్టిబాబు’ ఎలా ఇరుక్కుపోయామనేదే కథ. నాకూ కాస్త డిస్ట్రాక్షన్స్ ఉంటాయి.. అవన్నీ తెరపై చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు” అని అసలు సీక్రెట్ బయటపెట్టారు.
లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ప్రత్యేకంగా కోరడంతో వెంకటేష్ కాసేపు సింగర్‌గా మారిపోయారు. “నాకు మెమరీ చాలా తక్కువండీ” అంటూనే, ‘రాజనాల బియ్యం వండి.. బొమ్మిడాల పులుసు పెడితే.. రాగి ముద్దన అడుగుతాడే నారాయణమ్మ’ అంటూ ‘నారాయణమ్మ’ పాట పల్లవిని స్వయంగా పాడి అభిమానులను హుషారెత్తించారు. తమన్ అందించిన ఎనర్జిటిక్ ట్యూన్స్ సినిమాకు ప్రాణంగా నిలుస్తాయని ఆయన ప్రశంసించారు. స్పీచ్ ముగింపులో వెంకటేష్ అభిమానులకు ఒక విలువైన జీవిత సత్యాన్ని గుర్తుచేశారు. “జీవితంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరుకోండి. విశ్వంతో అనుసంధానమై మంచి పనులు చేయండి, ఎందుకంటే మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. జీవితంలో మీకు ఎన్ని ప్లాన్లు ఉన్నా.. ప్లాన్ A నుంచి Z దాకా ఆ భగవంతుడికే వదిలేయండి. ఆయన మనల్ని సరిగ్గా నడిపిస్తాడు” అంటూ తన ఆధ్యాత్మిక దృక్పథాన్ని చాటుకున్నారు. త్రివిక్రమ్ మార్కు స్క్రీన్ ప్లే, వెంకటేష్ కామెడీ టైమింగ్ మళ్లీ తెరపై చూడబోతున్నామన్న వార్తతో వెంకీ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














