
AA24: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ లైనప్ గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సెన్సేషన్ నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం అగ్ర దర్శకులతో భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్న బన్నీ, తన కెరీర్‌లోనే మైలురాయిగా నిలవనున్న ‘#AA24’ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి స్టోరీని ఎంచుకోబోతున్నారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో నెట్టింట ప్రత్యక్షమైన ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ కార్చిచ్చు రేపుతోంది. మలయాళంలో సూపర్ హీరో కాన్సెప్ట్‌తో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ‘మిన్నల్ మురళి’ చిత్ర రైటర్, స్టార్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కో-రైటర్ అరుణ్ అనిరుధన్ తాజాగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తోంది. అల్లు అర్జున్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన లగ్జరీ కార్ ‘బీస్ట్’ (రేంజ్ రోవర్) వద్ద దిగిన ఫొటోను అరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. ఇంకేముంది.. ఈ ఫొటో చూసిన సినీ ప్రియులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ డాట్స్ కనెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు.
కొద్దిరోజులుగా బాసిల్ జోసెఫ్ – అల్లు అర్జున్ కాంబోలో ఒక భారీ పాన్-ఇండియా మూవీ రాబోతోందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి బలం చేకూరుస్తూ, బాసిల్ కో-రైటర్ స్వయంగా బన్నీ వ్యక్తిగత లగ్జరీ కార్‌తో కనిపించడంతో.. కథా చర్చలు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రాజెక్ట్ దాదాపు లాక్ అయిపోయిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కోసం బాసిల్ టీమ్ ఒక అదిరిపోయే సరికొత్త సబ్జెక్ట్‌ను రెడీ చేస్తోందని, చర్చలు చివరి దశకు చేరడం వల్లే రైటర్ నేరుగా బన్నీ సర్కిల్‌లోకి అడుగుపెట్టారని ఫిల్మ్‌నగర్ టాక్. ఒకవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందనే ఊహాగానాలు ఉండగా, మరోవైపు ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ హింట్స్ బయటకు వస్తుండటంతో ఈ క్రేజీ కాంబోపై హైప్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. ‘మిన్నల్ మురళి’ వంటి క్రేజీ విజువల్స్, డ్రామాను రాసిన అరుణ్ అనిరుధన్ పెన్ పవర్.. బాసిల్ జోసెఫ్ యూనిక్ టేకింగ్.. వీటికి ఐకాన్ స్టార్ మాస్ మేనియా తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు పుట్టుకురావడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ మూవీపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
