AK 47 Release Date: అక్టోబర్ 30నే వెంకీ-త్రివిక్రమ్ ‘ఏకే 47’ రిలీజ్ !

AK47 Teaser

AK 47 Release Date: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో వస్తున్న క్రేజీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్‌ నెం.47’ (ఏకే 47) కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో అభిమానులను కొద్దిరోజులుగా ఊరిస్తున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకి తెరపడింది. ఒకే నెలలో రెండుసార్లు వాయిదా పడి అందరినీ అయోమయానికి గురిచేసిన ఈ ప్రాజెక్ట్.. ఎట్టకేలకు ఈ నెల 30న థియేటర్లలోకి రాబోతున్నట్లు చిత్ర బృందం సరికొత్త పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించింది.

నిజానికి ఈ సినిమాను మొదట గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2నే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కాస్తా అక్టోబర్ 9కి వెళ్లింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో 9న కూడా సినిమాను తీసుకురాలేకపోయారు. ఇలా ఒకే నెలలో బ్యాక్ టు బ్యాక్ రెండుసార్లు రిలీజ్ వాయిదా పడటంతో ఫ్యాన్స్‌లో కాస్త కంగారు మొదలైంది. అయితే ఆ పనులన్నీ పూర్తి చేసుకుని, పక్కాగా అక్టోబర్ 30న బాక్సాఫీస్ వద్ద దిగుతున్నట్లు టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ లాంటి ఆల్‌టైమ్ క్లాసిక్ సినిమాలకు త్రివిక్రమ్ మాటలు రాస్తే, వెంకటేశ్ తన కామెడీ టైమింగ్‌తో స్క్రీన్‌పై మ్యాజిక్ చేశారు. ఇప్పటికీ టీవీల్లో వస్తే కళ్లప్పగించి చూసే ఆ సినిమాల తర్వాత.. వీరిద్దరి కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ కేవలం రచయితగానే పనిచేయగా, ఇప్పుడు తొలిసారి వెంకీని స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే హాస్యం, అలాగే అదిరిపోయే యాక్షన్ అంశాలతో ఈ సినిమా ఉండబోతోందని ప్రచార చిత్రాలు చూస్తేనే అర్థమవుతోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అక్టోబర్ 30న థియేటర్లలో ఈ ‘ఏకే 47’ ఎలాంటి తుపాకీ తూటాల్లాంటి పంచ్‌లు పేలుస్తుందో చూడాలి.