
Tiger Shroff: బాలీవుడ్లో గ్యాంగ్స్టర్ల నెట్వర్క్ మరోసారి తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఆదివారం సాయంత్రం ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే జుహు ప్రాంతంలో బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కారు లక్ష్యంగా దుండగులు తుపాకీతో విరుచుకుపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై బైక్‌పై వచ్చిన ముగ్గురు ఆగంతకులు వరుసగా కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ ప్రమాదం నుంచి టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాలతో బయటపడగా, కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
ఈ దారుణ దాడికి తామే కారణమంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరిట సోషల్ మీడియాలో పోస్టులు బయటకు రావడం ఇండస్ట్రీని మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిత్, హర్మన్ సంధు అనే వ్యక్తుల పేరిట ఈ బాధ్యతను ప్రకటిస్తూ సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. “సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయవద్దని మేం ఎన్నోసార్లు హెచ్చరించాం.. ఆ వార్నింగ్‌ను బేఖాతరు చేసినందుకే టైగర్ ష్రాఫ్‌ను టార్గెట్ చేశాం” అంటూ ఆ పోస్టుల్లో పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
కాల్పుల ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న జుహు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ పోస్టుల వెనుక నిజంగానే బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సల్మాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఇప్పటికే పలువురు ప్రముఖులు బెదిరింపులు ఎదుర్కొంటుండగా, ఇప్పుడు ఏకంగా టైగర్ ష్రాఫ్పైనే దాడి జరగడం చిత్ర పరిశ్రమ వర్గాల్లో తీవ్ర అలజడి రేపుతోంది.













