Ajay Devgn: అజయ్ దేవగణ్ బంగ్లాపై పడ్డ బుల్డోజర్లు! బీఎంసీ షాకింగ్ యాక్షన్

Ajay Devgn

Ajay Devgn: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌కు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అదిరిపోయే షాక్ ఇచ్చింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమంగా చేపట్టిన పనులపై అధికారులు ఏమాత్రం ఉపేక్షించకుండా కొరడా ఝుళిపించారు. ముంబయిలోని అత్యంత సంపన్న ప్రాంతమైన జుహులోని ఆయన విలాసవంతమైన బంగ్లాలో అనధికారికంగా నిర్మించిన కొన్ని భాగాలను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. స్టార్ హీరో ఇల్లు అని కూడా చూడకుండా అధికారులు బుల్డోజర్లతో రంగంలోకి దిగి చర్యలు తీసుకోవడం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. జుహు ప్రాంతంలోని కపోల్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అజయ్ దేవగణ్‌కు దాదాపు 7,802 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ లగ్జరీ బంగ్లా ఉంది. ఈ భవనంలో అంతర్గతంగా మార్పులు చేస్తూ కొత్తగా విభజన గోడలు నిర్మించడం, కిటికీల అమరికలను మార్చడం సహా పలు అదనపు నిర్మాణాలను ఆయన మొదలుపెట్టారు. అయితే, మున్సిపల్ చట్టాల ప్రకారం ఇలాంటి కీలక మార్పులు చేసే ముందు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పర్మిషన్లు వేటినీ ఆయన తీసుకోలేదని బీఎంసీ స్పష్టం చేసింది.

ఈ అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు సెప్టెంబర్ 10వ తేదీనే అజయ్ దేవగణ్‌కు అధికారిక నోటీసులు పంపారు. జరుగుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని, పనులకు సంబంధించిన అనుమతి పత్రాలు ఏవైనా ఉంటే తమ ముందు ఉంచాలని గట్టిగా ఆదేశించారు. అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అజయ్ దేవగణ్ కాంపౌండ్ నుంచి సరైన స్పందన రాలేదు. నిబంధనల ప్రకారం నిర్మాణాలను ఆపకపోగా, పనులు యథేచ్ఛగా కొనసాగించినట్లు తనిఖీల్లో తేలింది. నోటీసులను కూడా లైట్ తీసుకున్నారన్న కోపంతో బీఎంసీ అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కూల్చివేత బృందాలతో నేరుగా బంగ్లా వద్దకు చేరుకున్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన గోడలు, ఇతర నిర్మాణాలను అక్కడికక్కడే కూల్చివేశారు. ముంబయిలో నిబంధనలు మీరితే ఎంతటి స్టార్లయినా సరే చట్టం ముందు సమానమేనని బీఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. గతంలో కంగనా రనౌత్ వంటి పలువురు స్టార్ల ఆస్తుల విషయంలోనూ బీఎంసీ ఇలాంటి కఠిన వైఖరినే ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజయ్ దేవగణ్ బంగ్లాలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మహానగరంలో చర్చనీయాంశంగా మారింది.