
Nagarjuna: తెలుగు చిత్రసీమలో నూతన ప్రతిభను గుండెలకు హత్తుకోవడంలో కింగ్ నాగార్జున శైలే వేరు. వైవీఎస్ చౌదరి మొదలుకొని ఎందరో దర్శకులను, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి అందించిన అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఆయన మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. నూతన నటుడు అనీష్, అనశ్వర రాజన్ జంటగా తెరకెక్కిన ‘ఇట్లు అర్జున’ చిత్రాన్ని సమర్పించడానికి ముందుకొచ్చిన నాగార్జున, ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో తాను వ్యక్తం చేసిన అభ్యంతరాలను, హెచ్చరికలను ఓపెన్‌గా బయటపెట్టడం ఇప్పుడు టాలీవుడ్లో సరికొత్త సంచలనంగా మారింది. గ్రాండ్ రివీల్ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ “హీరోగా ఎంట్రీ ఇస్తూనే మూగవాడి పాత్ర ఎంచుకోవడం ఏంటి? అంత పెద్ద రిస్క్ ఎందుకు చేస్తున్నావ్? సింపుల్ లవ్ స్టోరీతో వెళ్లొచ్చు కదా అని అనీష్‌ను గట్టిగానే వారించాను” అని స్పష్టం చేశారు.
దర్శకుడు అనీష్, నిర్మాతలు మహేష్, వెంకీలు తొలుత గ్లింప్స్ కోసం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా నాగార్జునను సంప్రదించారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలను నాగార్జున గుర్తు చేసుకున్నారు. “అనీష్‌తో ఉన్న పాత పరిచయంతో గ్లింప్స్ చూసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. అయితే హీరోకి మాటలు ఉండవని తెలిసిన వెంటనే నాకు భయం వేసింది. ఫస్ట్ మూవీతోనే ఇలాంటి సాహసం అవసరమా అని ప్రశ్నించా. సాధారణమైన ప్రేమకథ చేయమని సలహా ఇచ్చా. కానీ నా మాటల కంటే తమ స్క్రిప్ట్‌పై వాళ్లకున్న కాన్ఫిడెన్సే గెలిచింది. పట్టుబట్టి సినిమాను పూర్తి చేసి తీసుకొచ్చి చూపించారు. సినిమా చూశాక నా అంచనాలన్నీ తలకిందులయ్యాయి.”*
గతంలో రాజ్ తరుణ్, అవికా గోర్ నటించిన ‘ఉయ్యాల జంపాల’ చిత్రాన్ని కూడా మొదట కొంతవరకే చూశానని, ఆ కంటెంట్ విపరీతంగా నచ్చడంతో తానే స్వయంగా భాగస్వామిగా మారి చిత్రాన్ని విడుదల చేశానని చెప్పారు. ఆ సినిమా ఏ స్థాయి ఘనవిజయం సాధించిందో, ఎందరి కెరీర్లను మలుపు తిప్పిందో అందరికీ తెలిసిందేనని అన్నారు. మళ్లీ ఇన్నేళ్లకు ‘ఇట్లు అర్జున’ చూసినప్పుడు సరిగ్గా అదే రకమైన స్పార్క్ కనిపించిందని నాగార్జున పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రధాన బలం స్క్రీన్‌ప్లే అని నాగార్జున కొనియాడారు. అనీష్, అనశ్వర రాజన్ మధ్య పండిన బాడీ లాంగ్వేజ్, ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఒక రొమాంటిక్ డ్రామాకు ప్రాణప్రదంగా నిలిచింది. మూగవాడి పాత్ర అయినప్పటికీ సినిమా ఎక్కడా నెమ్మదించకుండా, ఊహించని ట్విస్టులు, కడుపుబ్బా నవ్వించే వినోదంతో సాగుతుంది. సినిమా పూర్తికాగానే నిర్మాతలు అడగ్గానే మరో ఆలోచన లేకుండా తానే ప్రెజెంట్ చేస్తానని మాటిచ్చినట్లు తెలిపారు.
‘ఇట్లు అర్జున’ విజువల్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, రషెస్ చూసిన వెంటనే తన ప్రతిష్టాత్మక 100వ మైలురాయి చిత్రం ‘కింగ్ 100’ కోసం సినిమాటోగ్రాఫర్ రాజానే డీవోపీగా ఖరారు చేసుకున్నట్లు వేదికపై అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే ఎస్.ఎస్. తమన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయని, సినిమా విడుదలకు ఈ సంగీతం పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పారు. ప్రసంగం ముగింపులో విలేకరి సరదాగా అడిగిన ప్రశ్నకు నాగార్జున తన మార్క్ చమత్కారాన్ని జోడించారు. జీవితంలో మొట్టమొదటిసారి ‘ఇట్లు నాగార్జున’ అని ఎవరికి ప్రేమలేఖ రాశారని అడగ్గా “నాకు ఉత్తరాలు రాసే అలవాటే లేదు, ఏదైనా ఉంటే నేరుగా వెళ్లి ముఖం మీదే మాట్లాడేస్తాను” అంటూ నవ్వులు పూయించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇట్లు అర్జున’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని నాగార్జున ధీమా వ్యక్తం చేశారు.













