
Nivetha: వెండితెరపై కనిపించే గ్లామర్ తారల జీవితం బయటకు ఎంత అందంగా కనిపిస్తుందో, లోపల వారు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి అంతకుమించి ఉంటుంది. ముఖ్యంగా తమ రూపం, బాడీ షేమింగ్ గురించి సమాజం ఏమనుకుంటుందోనన్న భయం హీరోయిన్లను సైతం వెంటాడుతుందనడానికి తాజా ఉదాహరణే టాలెంటెడ్ నటి నివేదా థామస్. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ఫేస్ లుక్స్‌పై వచ్చిన అనుమానాలతో కొన్ని నెలల పాటు ఫొటోలను పోస్ట్ చేయలేక దాచేసుకున్నానంటూ ఆమె బయటపెట్టిన నిజాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ ఏడాది స్టార్టింగ్‌లో దిగిన కొన్ని ఫొటోలను ఇప్పటివరకు ఎందుకు షేర్ చేయలేకపోయానో నివేదా వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
“ఆ రోజు నేను ఎంతో అందంగా కనిపించాను. ఆ పిక్స్ చూసిన ప్రతిసారీ ఉదయాన్నే నిద్రలేవడం, సరదాగా కాఫీ కౌంటర్ దగ్గరకు వెళ్లడం, నవ్వుతూ గడిపిన అందమైన క్షణాలు గుర్తొచ్చేవి. కానీ నా ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుందేమో.. నన్ను చూసి జనాలు ఏమనుకుంటారో అనే భయమే నన్ను ఇన్ని నెలలు ఆ ఫొటోలను పోస్ట్ చేయకుండా ఆపేసింది. వాటిని నా ఫోన్ గ్యాలరీలోనే దాచిపెట్టడం నిజంగా చాలా బాధ కలిగించింది” అంటూ తనలోని అభద్రతా భావాన్ని ఓపెన్‌గా ఒప్పుకున్నారు.
నేటి సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిదీ ఫిల్టర్లతో కృత్రిమంగా మారిపోతోందని నివేదా హెచ్చరించారు. “మన భావోద్వేగాలతో పాటు సహజంగా ఎలా ఉన్నామో అలా బతకడమే అసలైన అందం. మనసులో ఇలాంటి భయాలు, సందేహాలు రావడం సహజమే. కానీ వాటిని అంగీకరిస్తూనే జీవితాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించాలి” అంటూ ప్రతి ఒక్కరికీ ధైర్యాన్నిచ్చే మెసేజ్ ఇచ్చారు. సెలబ్రిటీ హోదాలో ఉంటూ కూడా తనలోని లోపాలను, ఎదుర్కొన్న ఆందోళనను ఏమాత్రం దాచుకోకుండా నివేదా పంచుకున్న ఈ మాటలు నెటిజన్ల మనసులను తాకుతున్నాయి. ‘అందానికి ఫిల్టర్లు కాదు.. సహజత్వమే ముఖ్యం’ అంటూ ఆమె ఇచ్చిన సందేశానికి సోషల్ మీడియాలో విశేష మద్దతు లభిస్తోంది.













