Site icon TeluguMirchi.com

Allu Arjun Fans: అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సరికొత్త రికార్డ్‌.. లక్ష మంది యువతులకు చేరువ!

Allu Arjun Fans Association

Allu Arjun Fans: సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌. అభిమానాన్ని సేవా కార్యక్రమాలతో ముడిపెడుతూ పలు కార్యక్రమాలు చేపడుతున్న అభిమానులు తాజాగా మరో అరుదైన ఘనతను సాధించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వస్థ్‌ నారీ, వికసిత్‌ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ మద్దతుగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 400కు పైగా అవగాహన కార్యక్రమాల్లో బన్నీ అభిమానులు భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు లక్ష మందికి పైగా బాలికలు, యువతులకు చేరువైనట్లు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రాముఖ్యత, సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో అల్లు అర్జున్‌ అభిమానులు సమష్టిగా పాల్గొన్నారు. ముఖ్యంగా బాలికలు, యువతులు తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని వివరించడంతో పాటు.. సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ప్రాధాన్యతను తెలియజేసినట్లు సమాచారం. అభిమానాన్ని కేవలం సినిమా, హీరోలకే పరిమితం చేయకుండా సామాజిక బాధ్యతగా మార్చుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంపై అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి. భవిష్యత్తులోనూ మరిన్ని సామాజిక కార్యక్రమాలను చేపట్టేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Exit mobile version