
Bhagyashri Borse: సౌత్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఖాతాలో మరో భారీ ప్రాజెక్ట్ చేరింది. ఇటీవల ‘లెనిన్’ మూవీతో ఆడియన్స్‌ను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు నేరుగా మలయాళ చిత్రసీమను ఏలేందుకు సిద్ధమవుతోంది. అది కూడా సాదాసీదా చిత్రంతో కాదు.. మాలీవుడ్ లెజెండరీ స్టార్ మోహన్‌లాల్ సరసన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో భాగ్యశ్రీ స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. డైరెక్టర్ విష్ణు మోహన్ తెరకెక్కిస్తున్న ఈ పాన్-ఇండియా మూవీ పేరు ‘ఆపరేషన్ గంగా’. ఉక్రెయిన్ – రష్యా భీకర యుద్ధం సమయంలో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయ విద్యార్థులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చారిత్రక రెస్క్యూ మిషన్ స్టోరీ లైన్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వాస్తవ ఘటనలు, ఉత్కంఠభరిత యాక్షన్ సన్నివేశాల మేళవింపుగా వస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం.
ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ నుంచి తాజాగా మోహన్‌లాల్‌తో కలిసి దిగిన ఓ ప్రత్యేకమైన ఫొటోను భాగ్యశ్రీ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మోహన్‌లాల్ వంటి లెజెండరీ నటుడితో పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. “మోహన్‌లాల్ సార్‌తో స్క్రీన్ పంచుకోవడం ఓ అద్భుతమైన అనుభవం. ఈ ప్రయాణంలో ఆయన నుంచి ప్రతీక్షణం నటనలోని మెళకువలు, సరికొత్త విషయాలు నేర్చుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది. మంచి కథలు, బలమైన క్యారెక్టర్స్‌తో సౌత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న భాగ్యశ్రీ.. అంతర్జాతీయ స్థాయి స్టోరీతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’తో ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. లెజెండరీ స్టార్ మోహన్‌లాల్ మార్కెట్, ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్ కలిసి ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి.
