Site icon TeluguMirchi.com

Anaswara Rajan : భాషే ఛాలెంజ్.. యూనిట్ సపోర్టే బలం – ‘ఛాంపియన్’ హీరోయిన్ అనస్వర రాజన్

Anaswara rajan
Anaswara Rajan On Champion : స్వప్న సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న అప్‌కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనస్వర రాజన్ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

తెలుగులో స్వప్న సినిమాస్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌తో లాంచ్ కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అనస్వర తెలిపారు. “వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ వంటి గొప్ప సంస్థలతో తెలుగులో నా తొలి సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు తెలుగు స్పష్టంగా రాకపోయినా యూనిట్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. నాపై చాలా కేర్ తీసుకున్నారు” అని చెప్పారు. టీజర్‌లో తన డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడం సంతోషాన్ని ఇచ్చిందని, డైరెక్టర్ ప్రదీప్ గారు ప్రతి పదాన్ని ఓపికగా నేర్పారని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు చాలా గొప్ప మనసున్నవారని, ఇతర భాషల్లో చేసిన సినిమాలకు కూడా ఎంతో ప్రేమ చూపించారని చెప్పిన అనస్వర… ‘ఛాంపియన్’ను కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.

తెలుగు ఇండస్ట్రీలో పనిచేయడం తనకు చాలా ఇష్టంగా అనిపించిందని అనస్వర అన్నారు. “ఇక్కడ సినిమాలు చాలా గ్రాండ్‌గా ఉంటాయి. ఫిల్మ్‌మేకర్స్, ప్రొడ్యూసర్స్ ఎంతో సపోర్టివ్‌గా ఉంటారు. ఒక్కసారి ఇక్కడ పనిచేస్తే మళ్లీ మళ్లీ తెలుగు సినిమాలే చేయాలనిపిస్తుంది” అని చెప్పారు. ‘గిరగిరా’ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందం ఇచ్చిందని, ఆ పాట షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశామని తెలిపారు. రోషన్ అద్భుతమైన డాన్సర్ అని ప్రశంసిస్తూ, అతనితో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా అనిపించిందన్నారు.

స్వప్న గారి సపోర్ట్ తనకు చాలా ఎనర్జీ ఇచ్చిందని, ఆమె అప్లాజ్ తనకు మరింత ఉత్సాహం ఇచ్చేదని చెప్పారు. కథ విన్నప్పుడే చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యానని, ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే కథ ఇది అని అనస్వర తెలిపారు. తాను చేసిన చంద్రకళ పాత్ర ప్రత్యేకంగా నచ్చిందని, ఆ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భాషే తనకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయినప్పటికీ, డైరెక్టర్ సపోర్ట్‌తో క్యారెక్టర్‌ను పర్ఫెక్ట్‌గా చేయగలిగానన్నారు.

పీరియడ్ సినిమాలు చేయడం తనకు చాలా ఇష్టమని, వింటేజ్ కాలం కాస్ట్యూమ్స్, లుక్ అనుభవించడం ఎంతో ఎక్సైటింగ్‌గా అనిపించిందని చెప్పారు. హైదరాబాద్ ఫుడ్, ముఖ్యంగా బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ, ఆయన ‘హ్యాపీడేస్’ పాటలు తనకు ఎంతో ఇష్టమని, ‘ఛాంపియన్’కి ఇచ్చిన మ్యూజిక్ మనసును ఆకట్టుకునేలా ఉందన్నారు.

అలాగే ‘ఛాంపియన్’ ట్రైలర్‌ను రామ్ చరణ్ గారు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, ఆయన ‘మగధీర’ సినిమా తన ఫేవరెట్ అని తెలిపారు. తెలుగులో తనకు ఇష్టమైన స్టార్ అల్లు అర్జున్ అని చెప్పిన అనస్వర, ప్రస్తుతం తెలుగులో ‘ఇట్లు మీ అర్జున్’ సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించారు.

డిసెంబర్ 25న విడుదలవుతున్న ‘ఛాంపియన్’ తనకు తెలుగులో గుర్తుండిపోయే సినిమా అవుతుందని అనస్వర రాజన్ నమ్మకం వ్యక్తం చేశారు.

Exit mobile version