
Rashmika: వెండితెరపై పాత్రల్లో జీవించడమే కాదు, నిజ జీవితంలోనూ అండగా నిలవడమే తన నైజమని నిరూపించుకున్నారు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. తన తాజా చిత్రం ‘రణబాలి’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దక్షిణాది వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. సినిమాలో తాను పోషించిన ‘జయమ్మ’ పాత్ర నుంచి స్ఫూర్తి పొంది ఏకంగా 400 నిరుపేద కుటుంబాలను ఆమె దత్తత తీసుకున్నారు.
‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ పేరుతో రష్మిక ఈ బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, మహబూబ్నగర్, అనంతపురం, విజయవాడలతో పాటు బెంగళూరు, కొచ్చి, చెన్నై, కొడగు ప్రాంతాలకు చెందిన 400 కుటుంబాలకు మూడు నెలల పాటు సరిపోయే నిత్యావసర సరుకులను ఆమె స్వయంగా అందజేస్తున్నారు. ఈ సాయాన్ని రాబోయే ఏడాది పాటు నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు ఆమె ప్రకటించారు. నిత్యావసరాల కోసం వెచ్చించే మొత్తాన్ని ఆదా చేసుకుని, ఆయా కుటుంబాలు తమ భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలన్నదే తన లక్ష్యమని రష్మిక స్పష్టం చేశారు.
సాధారణంగా తాను చేసే సేవా కార్యక్రమాలను గోప్యంగా ఉంచడానికే ఇష్టపడే రష్మిక, ఈసారి స్వయంగా బయటపెట్టడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. తనను చూసి మరికొందరు ప్రేరణ పొంది సేవా మార్గంలో నడవాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని పంచుకున్నట్లు తెలిపారు. తాను పడిన కష్టం, అనుభవించిన గాయాలు, నిద్రలేని రాత్రులన్నింటికీ పేదల ముఖాల్లోని చిరునవ్వే అసలైన ప్రతిఫలమని ఆమె ఎమోషనల్ అయ్యారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటించిన పీరియాడికల్ డ్రామా ‘రణబాలి’ ఈ నెల 16న గ్రాండ్గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, రష్మిక చూపించిన ఈ ఉదారత అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.













