
Devaraaya: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందింది. సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవరాయ’ నుంచి తాజాగా కీలకమైన అప్‌డేట్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సుదీప్ చారిత్రక మహారాజు శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి చారిత్రక పాత్రను సుదీప్ పోషిస్తుండటంతో ‘దేవరాయ’పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. విడుదల చేసిన గ్లింప్స్‌లో సుదీప్ రాజసం, గంభీరతతో కూడిన లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ పాత్ర కోసం ఆయన లుక్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో ‘చరిత్రను మార్చిన సామ్రాజ్యం.. ఒక శకాన్ని నిర్వచించిన రాజు.. కాలాన్ని దాటి నిలిచే ఓ దిగ్గజం’ అంటూ ‘దేవరాయ’ చిత్రాన్ని మేకర్స్ పరిచయం చేశారు. అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్‌ను శ్రీకృష్ణదేవరాయల పాత్రలో చూపించనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారింకంగా ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సుదీప్ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
