
Dhanush: తమిళ సినీ పరిశ్రమలో యంగ్ డైరెక్టర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న దర్శకుడు, నటుడు ఎలన్.. తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో ఆయన హీరో ధనుష్‌తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై ఎలన్ క్లారిటీ ఇచ్చారు. ధనుష్‌తో చేయాల్సిన సినిమా ఇప్పటికీ తన లైనప్‌లో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ధనుష్‌తో సినిమా గురించి ప్రశ్నించగా ఎలన్ స్పందిస్తూ.. ఆ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని తెలిపారు. ఇది సాధారణ సినిమా కాదని, తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. అందుకే సరైన సమయంలోనే ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నట్లు చెప్పారు. దర్శకుడిగా తన స్థాయిని మరింత పెంచుకోవడంతో పాటు, ధనుష్ కూడా తన ఇతర కమిట్‌మెంట్స్ నుంచి ఫ్రీ అయ్యే సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కథ ధనుష్‌కు కూడా ఎంతో నచ్చిందని ఎలన్ తెలిపారు. ప్రాజెక్ట్ గురించి చివరి వరకు ధనుష్ తనతో మాట్లాడినప్పుడు.. ఈ కథ తనకు నిజంగా నచ్చిందని స్పష్టంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. కథ విషయంలో ధనుష్‌కు ఎలాంటి సందేహం లేదని, అందుకే ఈ ప్రాజెక్ట్‌పై తనకూ మరింత నమ్మకం పెరిగిందని అన్నారు. అయితే మొదట్లో ఉన్న పరిస్థితుల్లోనే సినిమాను ఎలాగైనా తెరకెక్కించాలని భావించినప్పటికీ, ఇప్పుడు మాత్రం ఆ ఆలోచనను మార్చుకున్నట్లు ఎలన్ చెప్పారు. సినిమా తీస్తే పూర్తిస్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కథకు న్యాయం చేసేలా, తాను గర్వపడే స్థాయిలో సినిమాను రూపొందించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ధనుష్‌తో సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై ఎలన్ స్పష్టమైన తేదీని ప్రకటించలేదు. అయితే సరైన సమయం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ తప్పకుండా కార్యరూపం దాల్చుతుందని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.
