
Kamal Haasan: కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మండాడి చిన్న సినిమాగా మొదలై సంచలన వసూళ్లు సృష్టిస్తోంది. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. కంటెంట్ బలంగా ఉంటే కాసులు వాటంతట అవే రాలుతాయని నిరూపిస్తూ, కోస్టల్ రేసింగ్ అనే విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సినీ దిగ్గజాల ప్రశంసలతో మరింత వెలిగిపోతోంది. చిత్ర ఘన విజయం నేపథ్యంలో స్వయంగా ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ చిత్ర బృందాన్ని తన వద్దకు పిలిపించుకుని ప్రత్యేకంగా సత్కరించారు. దర్శకుడు మతిమారన్ పుగళేంది, హీరో సూరిలతో పాటు తెలుగు నటుడు సుహాస్‌ను ఆయన మనస్ఫూర్తిగా ప్రశంసించారు.
సినిమా డైలాగ్స్, స్టోరీ, అరుదైన తీరప్రాంత పందాల నేపథ్యాన్ని కమల్ విశ్లేషిస్తూ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. “డైలాగ్స్ చాలా చక్కగా రాసుకున్నారు.. ఇలాంటి ఒక వినూత్నమైన సబ్జెక్ట్ లభించడం మీ అదృష్టం” అంటూ యూనిట్‌ను కమల్ ప్రశంసించారు. లెజెండరీ యాక్టర్ నోటి నుంచి వచ్చిన ఈ మాటలు తన సినీ ప్రయాణంలోనే అత్యంత మరపురాని క్షణాలని హీరో సూరి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అసలు సిసలు హైలైట్ మాత్రం టాలీవుడ్ యువ నటుడు సుహాస్ పాత్రే. తెలుగులో విలక్షణమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్, ఈ చిత్రంతో కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. ఇందులో ఆయన పోషించిన విలన్ రోల్‌కి విమర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్క్రీన్‌పై సుహాస్ చూపించిన నెగెటివ్ షేడ్స్, నటనలోని మెచురిటీ స్వయంగా కమల్ హాసన్ ప్రత్యేకంగా ప్రస్తావించి మెచ్చుకోవడం విశేషం. తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే ఇంతటి ఇంపాక్ట్ చూపించడం సుహాస్ కెరీర్‌కు మరో పెద్ద మలుపుగా మారిందని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామా రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.














