
Dil Raju: టాలీవుడ్ అగ్ర నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు తాజా వ్యాఖ్యలు సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. అఖిల్ రాజ్, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో బద్రప్ప గాజుల తెరకెక్కించిన ‘క్రేజీ కళ్యాణం’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత బి. జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి దిల్ రాజు వేదికపై సరదాగా వేసిన పంచులు, చేసిన ఓపెన్ కామెంట్స్ అందరినీ నవ్వించడంతో పాటు విశేషంగా ఆకట్టుకున్నాయి.
స్టేజీపై మాట్లాడిన దిల్ రాజు.. “జగన్ చాలా రోజుల క్రితమే వచ్చి సినిమా చేస్తున్నానని చెప్పాడు. తీరా సినిమా రెడీ అయ్యాక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్‌కి ఇచ్చేశాడు. నాకు ఏరియా సినిమా ఇవ్వకుండానే నిన్న రాత్రి నుంచి తిరుమల్ రెడ్డితో కలిసి నన్ను ఫోన్లతో చంపుతున్నారు. నేను చెన్నైలో ఉన్నా సరే వీళ్ల కోసమే హడావిడిగా తిరిగి వచ్చా. వచ్చాకే తెలిసింది.. నాకు సినిమా బిజినెస్ ఇవ్వకుండా కేవలం గెస్ట్‌గా పిలిచారని! నువ్వు మంచి పనే చేశావ్ జగన్.. బతికిపోయావ్” అంటూ నవ్వులు పూయించారు. అయితే సినిమా కంటెంట్ చాలా బాగుందని, బన్నీ వాస్ ఇప్పటికే చూసి హిట్ సినిమా అని తనతో స్వయంగా చెప్పినట్లు వెల్లడించారు. ‘ఆహా’ అధినేత శ్రీనివాస్ సాధారణంగా సినిమా హిట్ అని నమ్మితేనే డిజిటల్ రైట్స్ కొంటారని, ఆయన కూడా రైట్స్ తీసుకోవడం సినిమాకు అతిపెద్ద పాజిటివ్ సైన్ అని పేర్కొన్నారు.
మల్టీ టాలెంటెడ్ తరుణ్ భాస్కర్‌ను ఉద్దేశించి దిల్ రాజు మాట్లాడుతూ.. “ఈయన అసలు డైరెక్టరో లేక యాక్టరో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎక్కడ చూసినా ఈయనే కనిపిస్తున్నాడు. అటేమో ‘ఈ నగరానికి ఏమైంది-2’ అంటాడు, ఇటేమో రవితేజ సినిమాలో యాక్టింగ్ అంటాడు, మధ్యలో తమిళంలో కూడా చేస్తున్నాడట. డైరెక్టర్‌గా వచ్చి ‘పెళ్లి చూపులు’ లాంటి హిట్ ఇచ్చి, ఇప్పుడు నటుడిగానూ రాణిస్తుండటం గ్రేట్” అంటూ కొనియాడారు.
అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను ప్రశంసిస్తూ.. “సాయి పల్లవి తర్వాత మలయాళం నుంచి వచ్చి తెలుగు నేర్చుకోవడమే కాకుండా, శతమానం భవతి సినిమా నుంచే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఇప్పుడు తెలంగాణ యాసను కూడా ఒంటపట్టించుకుని మాట్లాడటం అభినందనీయం” అన్నారు. దసరా పండుగ బరిలో విడుదలవుతున్న పెద్ద చిత్రాల మధ్య ఈ చిన్న సినిమా కూడా ఘన విజయం సాధించి ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.
