Mythri Ravi: రూ. 2 కోట్లతోనే అసలైన పాన్ ఇండియా సినిమా తీశారు..: మైత్రీ రవి

Y Ravi Shankar

Mythri Ravi: చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగని చరిత్ర సృష్టించిన ‘హనుమాన్ అంశ్’ మూవీ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం తెలుగు వర్షన్ ప్రెస్‌మీట్ వేదికగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై.రవిశంకర్ చేసిన కామెంట్స్ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ సాధించడం సినీ చరిత్రలోనే అద్భుతమని, భారీ బడ్జెట్లతో సినిమాలు తీసే తమలాంటి నిర్మాతలకు ఇది ఒక చెంపపెట్టు లాంటిదని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘హనుమాన్ అంశ్’ సాధించిన ఈ రికార్డు కలెక్షన్లపై రవిశంకర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. “మేము వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఎంత వస్తుందో లెక్కలు తేలడం లేదు. కానీ కేవలం రెండు కోట్లతో తెరకెక్కిన చిత్రం రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ సాధించిందంటే మామూలు విషయం కాదు. అసలైన పాన్ ఇండియా విజయం అంటే ఇదే” అని ప్రశంసించారు. హీరో సత్య నటన, రాగిణి, విశాల్ చటర్జీ పనితీరును అభినందిస్తూ.. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా విపరీతంగా కలుషితమైపోయిందని రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం, ఏఐ (AI) టెక్నాలజీతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం చూస్తున్నాం. యువత ఇలాంటి మార్గాల్లో పక్కదారి పడుతున్న సమయంలో సమాజానికి దేవుడంటే భయం, భక్తిని గుర్తుచేసే డివినిటీ సినిమాలు చాలా అవసరం” అని ఆయన స్పష్టం చేశారు. కేవలం సందేశానికే పరిమితం కాకుండా, కమర్షియల్‌గానూ సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడం గొప్ప విషయమన్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ అధినేతలు విజయ్ కిరగందుర్, చలవేగౌడ ఈ సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యతను తమకు అప్పగించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. స్టీవ్ జాబ్స్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు సైతం ఆశీస్సులు అందుకున్న నీమ్ కరోలి బాబా జీవితం, హనుమంతుడి దైవత్వంతో ముడిపడి ఉన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని వివరించారు. ఎలాంటి పోటీ లేకుండా అక్టోబర్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, దసరా సెలవులు మొదలవుతున్న తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా థియేటర్లకు తీసుకెళ్లి ఈ సినిమాను చూపించాలని రవిశంకర్ విజ్ఞప్తి చేశారు. హనుమంతుడి ప్రెజెన్స్ ఉన్న చిత్రాలన్నీ అఖండ విజయాలు సాధిస్తున్నాయని, ‘హనుమాన్ అంశ్’ సైతం తెలుగు ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.