Rakul Preet Singh: ఐటీ రైడ్స్‌తో నాకేం సంబంధం?

Rakul Preet Singh

Rakul Preet Singh: ముంబయి వేదికగా ఇటీవల కలకలం రేపిన ఐటీ రైడ్స్‌లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి రావడం తీవ్ర దుమారం రేపింది. విదేశీ నిధుల మళ్లింపు, బినామీ ఆస్తులంటూ తనపై సాగుతున్న ప్రచారాలపై ఇప్పటిదాకా మౌనంగా ఉన్న రకుల్.. తాజాగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రతిష్టను బజారున పడేసేలా చేస్తున్న తప్పుడు ప్రచారాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ సోషల్ మీడియా వేదికగా ఓ ఘాటు బహిరంగ లేఖను రిలీజ్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ సూటిగా సమాధానం చెప్పారు. దేశంలో కానీ, విదేశాల్లో కానీ తన పేరు మీద ఎలాంటి బినామీ ఆస్తులు లేవని రకుల్ స్పష్టం చేశారు. ఎవరూ తనకు ఎలాంటి ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదని తేల్చిచెప్పారు.

ఒకరి నుంచి ఖరీదైన బహుమతులు, కానుకలు స్వీకరించడం తన రూల్స్‌కి విరుద్ధమని, అలాంటి సంస్కృతి తనది కాదని కుండబద్దలు కొట్టారు. తన ఎదుగుదల వెనుక ఏలాంటి చీకటి శక్తులు లేవని, స్వశక్తితోనే ఈ స్థాయికి చేరుకున్నానని రకుల్ గుర్తుచేశారు. “నేను క్రమశిక్షణ కలిగిన ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. సినీ పరిశ్రమలో నాకు ఎలాంటి గాడ్‌ఫాదర్ల అండ లేదు. నా స్వయంకృషితో, కష్టపడి పైకొచ్చా” అని రకుల్ పేర్కొన్నారు. ఆధారాలు లేని సంచలనాల కోసం ఇతరుల వ్యక్తిగత జీవితాలను, కష్టపడి సంపాదించుకున్న ప్రతిష్టను దెబ్బతీయడం దారుణమని, ఇలాంటి తప్పుడు వార్తలను వెంటనే ఆపాలని ఆమె హెచ్చరించారు.