Hombale Films: త్రివిక్రమ్ మిస్సయినా హోంబలే సైలెంట్‌గా తీసుకొస్తుంది.. తెలుగులో ‘హనుమాన్ అంశ్’!

Hanuman Ansh

Hombale Films: బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల బడ్జెట్, భారీ తారాగణం ఉంటేనే హిట్లు వస్తాయన్న అంచనాలను తలకిందులు చేస్తూ ఒక చిన్న చిత్రం సృష్టించిన అద్భుతం యావత్ చిత్రసీమను నివ్వెరపోయేలా చేసింది. ఎటువంటి హంగామా లేకుండా థియేటర్లలోకి వచ్చి ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లను కొల్లగొట్టిన ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 9న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పరమ హనుమద్భక్తుడైన నీమ్ కరోలి బాబా (1900-1973) జీవితం, ఆయన ప్రబోధాలు, మానవాళికి అందించిన సందేశాల ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

బాబా పాత్రలో శోభినవ్ సత్య ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఉత్తరాదితో పాటు విదేశాల్లోనూ ఊహించని సంచలనం సృష్టించింది. మౌత్ టాక్‌తో మొదలై ఏకంగా రూ.400 కోట్ల మార్కును అందుకోవడం భారతీయ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా నిలిచింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సమర్పణలో గత నెల 18నే ఈ చిత్రం తెలుగు తెరపైకి రావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. దాంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ‘కాంతార’, ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్ర రిలీజ్ బాధ్యతలను తన భుజాలపైకి ఎత్తుకోవడంతో ఒక్కసారిగా హైప్ రెట్టింపైంది. ఈ నెల 9న తెలుగులో వస్తున్న ఈ డివైన్ బ్లాక్‌బస్టర్ టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.