రివ్యూ : ‘సిగ్మా’

Cinema (1)

తెలుగు మిర్చి రేటింగ్: 3/5

Sigma Movie Review: డెబ్యూ డైరెక్టర్ జాసన్ సంజయ్ దర్శకత్వంలో యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కిన చిత్రం ‘సిగ్మా’. దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో పాటు లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మించడంతో తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. మరి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

వైజాగ్‌కు చెందిన గురు (సందీప్ కిషన్) తన తల్లికి ఎంతో ఇష్టమైన హోమ్ లైబ్రరీని నడుపుతుంటాడు. అయితే, తన తండ్రి చేసిన కోటి రూపాయల అప్పు అతన్ని వెంటాడుతూ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో అతనికి అనుకోకుండా విన్సెంట్ అనే వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న ‘సీజర్’ అనే ప్రమాదకరమైన డ్రగ్ రాకెట్ గురించి తెలుస్తుంది. విన్సెంట్ నెట్‌వర్క్‌ను దెబ్బకొట్టే పక్కా ఆధారాలు గురు చేతికి చిక్కడంతో, తన సమస్యలు తీర్చుకోవడానికి డబ్బు కోసం అతన్ని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తాడు.

అయితే ఈ డ్రగ్ సిండికేట్ వెనుక అసలు మాస్టర్‌‌మైండ్ ఇంటర్నేషనల్ స్మగ్లర్ కోట్లపాటి వెంకట రెడ్డి (సంపత్ రాజ్) అని గురుకి తర్వాతే అర్థమవుతుంది. ఆ ప్రమాదకరమైన నేర ప్రపంచం నుంచి గురు ఎలా బయటపడ్డాడు? అంతర్జాతీయ మాఫియాని ఎదుర్కొని తండ్రి చేసిన అప్పును తీర్చగలిగాడా లేదా? అన్నదే మిగతా కథ.

సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్: సినిమాకు ప్రధాన బలం సందీప్ కిషన్ ఎనర్జీ. దర్శకుడు జాసన్ సంజయ్ విజన్‌ను పూర్తిగా నమ్మి గురు పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీక్వెన్స్‌‌లలో తన డెడికేషన్, ఇంటెన్సిటీ స్పష్టంగా కనిపిస్తాయి. సినిమాను తన భుజాలపై నడిపించడంలో సందీప్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు.

డైరెక్షన్ & స్టైలిష్ మేకింగ్: తొలి చిత్రమైనప్పటికీ జాసన్ సంజయ్ యాక్షన్ సన్నివేశాలను, సినిమా మూడ్‌ను చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసుకున్నాడు. కథలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. పవర్‌ఫుల్ విలన్‌గా సంపత్ రాజ్ తనదైన విలనిజంతో మెప్పించారు. స్క్రీన్‌పై ఆయన ప్రజెన్స్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. పరిమిత స్క్రీన్ స్పేస్ దక్కినప్పటికీ ఫరియా అబ్దుల్లా ఉన్నంతలో ఫ్రెష్ లుక్స్‌తో ఆకట్టుకుంది. రాజు సుందరం, ఇతర నటీనటులు తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇంటర్వెల్ బ్యాంక్, ఫారిన్ లొకేషన్లలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాయి.

సాంకేతిక విభాగం:

జాసన్ సంజయ్ తొలి ప్రయత్నంగా ఒక కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌ను స్టైలిష్‌గా తెరకెక్కించడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉండి విజువల్స్‌కు హైలైట్‌గా నిలిచింది. థమన్ అందించిన నేపథ్య సంగీతం కొన్ని యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ విభాగం సెకండాఫ్‌పై మరికొంత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

తీర్పు:

మొత్తంగా చెప్పాలంటే ‘సిగ్మా’ ఒక డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్. సందీప్ కిషన్ అంకితభావం, పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, సంపత్ రాజ్ నటన, జాసన్ సంజయ్ స్టైలిష్ టేకింగ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. కథనంలో అక్కడక్కడా కనిపించే లోపాలు, రొటీన్ అంశాలను పక్కన పెడితే.. యాక్షన్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులకు, సందీప్ కిషన్ ఫ్యాన్స్‌కు ఈ వారాంతంలో ‘సిగ్మా’ ఒకసారి చూడదగ్గ పైసా వసూల్ ఎంటర్‌టైనర్.

తెలుగు మిర్చి రేటింగ్: 3/5