రాజకీయాల్లో కొత్త మాస్క్‌.. ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ వెనుక ఎవరున్నారు?


గత రెండు రోజులుగా పంది ముఖాన్ని పోలిన ఓ మాస్క్‌ పోస్టర్‌ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పలు దినపత్రికల్లోనూ ఈ పోస్టర్లు కనిపిస్తుండటంతో.. అసలు దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్న ఆసక్తి నెలకొంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓ మాజీ మంత్రి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. తనదైన రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ కూడా ప్రారంభించినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ పేరుతో కొన్ని ఖాతాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పార్టీ ఏర్పాటు వెనుక అసలు లక్ష్యం ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పంది ముఖాన్ని పోలిన మాస్క్‌ను పోస్టర్లలో చూపించడం ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?.. ఈ ప్రచారం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏమిటి? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఇప్పటికే కాక్రోచ్ పార్టీ వంటి వినూత్న పేర్లతో రాజకీయంగా చర్చకు వచ్చిన పార్టీల తరహాలోనే ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ కూడా తెరపైకి వస్తోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పార్టీ ఎవరిని లక్ష్యంగా చేసుకుని ముందుకు రాబోతోంది? రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పోస్టర్లు ఎందుకు కనిపిస్తున్నాయి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పోస్టర్ల వెనుక ఉన్నది ఎవరు? కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న మాజీ మంత్రి ఎవరనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఆయన వెనుక ఎవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా? లేక ఇదంతా కొత్త రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడికాలేదు.