Srinidhi Shetty: “కెరీర్ పోతుందని భయపెట్టారు.. 15 ఏళ్ల తర్వాత నేనేంటో తెలుస్తుంది”

Srinidhi Shetty

Srinidhi Shetty: హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు తల్లి పాత్రలు వేస్తే కెరీర్ ముగిసిపోతుందనేది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న అలిఖిత సూత్రం. అయితే ఈ లెక్కలను పక్కనపెట్టి కెరీర్ పరంగా చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు అందాల భామ శ్రీనిధి శెట్టి. విక్టరీ వెంకటేష్ సరసన ఆమె నటించిన సరికొత్త చిత్రం ‘ఆదర్శకుటుంబం’ ఈ నెల 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొన్న శ్రీనిధి, సినిమాలో తను పోషించిన తల్లి పాత్ర ఎంపికపై వస్తున్న విమర్శలకు దీటైన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్న శ్రీనిధి, కేవలం నటనపై ఉన్న బలమైన ఇష్టంతోనే వెండితెర వైపు అడుగులు వేశానని చెప్పారు. “మనం ప్రేమించి ఎంచుకున్న రంగంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా తట్టుకుని నిలబడాలి. సమస్యలను ఫేస్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి” అంటూ తన దృఢ నిశ్చయాన్ని చాటారు.

హీరోయిన్‌గా మంచి డిమాండ్ ఉన్న సమయంలో ‘ఆదర్శకుటుంబం’లో తల్లిగా నటించడంపై సినీ వర్గాల్లో తీవ్ర చర్చ సాగింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. “ఈ సినిమాలో తల్లిగా నటిస్తే నా కెరీర్‌ దెబ్బతింటుందని చాలామంది నన్ను హెచ్చరించారు. కానీ నా ఆలోచన వేరు. సినిమా చూశాక ఆ పాత్రలోని గాఢత, నేనెందుకు ఒప్పుకున్నానో అందరికీ బోధపడుతుంది. మరో 15 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా.. ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేనే గర్వపడేలా ఆ క్యారెక్టర్ ఉంటుంది” అని స్పష్టం చేశారు. సీనియర్ స్టార్ వెంకటేష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం మరచిపోలేని అనుభవమని శ్రీనిధి పేర్కొన్నారు. సెట్‌లో ఆయన ఎంతో సరదాగా ఉంటూనే తన నటనతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. వెంకటేష్ పనితీరు నుంచి ప్రేరణ పొంది, ఈ సినిమాలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు వెల్లడించారు. కథా బలం ఉన్న పాత్రల కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమని నిరూపించిన శ్రీనిధి, ‘ఆదర్శకుటుంబం’తో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.