
Hanuman Ansh: ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దృశ్య కావ్యం ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు గడ్డపై సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. బాలీవుడ్లో అనూహ్య విజయం సాధించిన ఈ చిత్రానికి టాలీవుడ్ నుంచి అగ్ర దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బాసటగా నిలవడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కంటెంట్ నచ్చితే పరభాషా చిత్రాలను సైతం అక్కున చేర్చుకోవడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలోనే ‘హనుమాన్ అంశ్’ చిత్రంలోని పవర్ఫుల్ డివైన్ ఎలిమెంట్స్, అద్భుతమైన స్టోరీ గుర్తించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్వయంగా ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ ఈ భారీ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకువస్తోంది. త్రివిక్రమ్ బ్రాండ్ తోడవ్వడంతో టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై ఒక్కసారిగా అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఉత్తరాదిలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ డివైన్ జర్నీ, తెలుగు వెర్షన్లో సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం వెండితెరపై మైథాలజీ, ఆధ్యాత్మిక కాన్సెప్ట్‌లకు విపరీతమైన ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో.. ‘హనుమాన్ అంశ్’ సైతం తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ తేదీ ఖరారు కావడంతో, త్వరలోనే తెలుగు ప్రమోషన్లు, ట్రైలర్ విడుదలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మాటల మాంత్రికుడి సమర్పణలో వస్తున్న ఈ భక్తిరస చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.














