Anurag Kashyap : భారత సెన్సార్ బోర్డు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై సినీ పరిశ్రమ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటి శ్రేయ ధన్వంతరి, టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో పాటు పలువురు ప్రముఖులు సెన్సార్ బోర్డు పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచినది మలయాళ చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ఈ సినిమాలో నాయిక పాత్రకు “జానకి” అనే పేరు పెట్టడం సెన్సార్ బోర్డుకు అభ్యంతరంగా మారింది. వారు “జానకి” అనేది హిందూ పౌరాణిక పాత్ర అయిన సీతాదేవి మరో రూపం కావడంతో, ఆ పేరును మార్చాలని సూచించారు. ఈ సూచనపై చాలా మంది సినీ ప్రముఖులు గట్టిగా స్పందించారు.
తాజాగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ అంశంపై స్పందిస్తూ, “కథలు రాస్తున్నప్పుడు పురాణాల్లోని పేర్లు వాడకూడదనడం చాలా విడ్డూరంగా ఉంది. మరి ఇకపై మన పాత్రలకు ఏం పేర్లు పెట్టుకోవాలి? ABC, XYZలా?” అంటూ వ్యాఖ్యానించారు. ఇవి మత పరమైన కోణంతో కాకుండా సృష్టిశీలతపై దాడిగా భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే, సెన్సార్ బోర్డు అధికారుల భాషా పరిజ్ఞానం గురించి కూడా అనురాగ్ తీవ్రంగా విమర్శించారు. “మహారాష్ట్రలో ఉండే సెన్సార్ బోర్డు సభ్యులకు హిందీ బాగా రాకపోవడం వల్ల, కొన్ని పదాల అర్థం సరిగ్గా పట్టుకోలేక అభ్యంతరాలు వెల్లగక్కుతున్నారు” అని ఆయన ఆరోపించారు.
ఇలాంటి నిర్ణయాలు కళాత్మక స్వేచ్ఛపై ముసురు కమ్మేలా ఉన్నాయంటూ, సినీ పరిశ్రమ సెన్సార్ బోర్డు పని తీరుపై పునరాలోచన అవసరమని అభిప్రాయపడుతోంది.

