
KAAKA: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కాకా’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ మాస్ కాంబో రిపీట్ అవుతుండటంతో ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలో సినిమా చిత్రీకరణకు సంబంధించి బయటకు వచ్చిన తాజా సమాచారం ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా సాగుతున్న ‘కాకా’ షూటింగ్ ఇప్పటికే ఏకంగా 70 శాతం పూర్తి చేసుకున్నట్లు సమాచారం. దర్శకుడు బాబీ వేసిన పక్కా ప్రణాళిక, చిరంజీవి పూర్తిస్థాయి సహకారంతో ఈ ప్రాజెక్ట్ పరుగులు పెడుతోంది.
ప్రస్తుతం కేవలం కొన్ని పాటలు, హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్‌లు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. రాబోయే అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ నాటికి గుమ్మడికాయ కొట్టేసేలా చిత్ర యూనిట్ రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. ఈ చిత్రంలో యువ నటి అనశ్వర రాజన్ కీలక పాత్రలో మెరవనుండగా, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, విలక్షణ నటుడు అనురాగ్ కశ్యప్ ఇటీవల టీమ్‌తో చేరడం ప్రాజెక్ట్‌పై హైప్‌ను మరింత పెంచేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ తమ తొలి తెలుగు వెంచర్‌గా ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఎస్.ఎస్. థమన్ తనదైన శైలిలో మాస్ బీట్లతో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. షూటింగ్ నిర్దేశిత సమయానికంటే ముందే పూర్తవుతుండటంతో, ఎట్టిపరిస్థితుల్లోనూ పండుగ బరి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టమైంది. వచ్చే ఏడాది జనవరి 13న పక్కాగా థియేటర్లలోకి దిగుతూ, సంక్రాంతి బాక్సాఫీస్‌పై చిరంజీవి మరోసారి మాస్ జాతర చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
