
Director Bharathiraja: భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా తమిళ సినిమాకు గ్రామీణ కథలతో కొత్త దిశను చూపిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వెండితెరపై పల్లెటూరి అందాలను, గ్రామీణ జీవన విధానాన్ని అత్యంత సహజత్వంతో ఆవిష్కరించి సినీ దిగ్గజంగా ఎదిగిన ఆయన మరణం దక్షిణాది చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని సినీ ప్రముఖులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.
‘16 వయతినిలే’తో సంచలన అరంగేట్రం
1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో భారతీరాజా జన్మించారు. సినిమాపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, 1977లో విడుదలైన “16 వయతినిలే” (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి అప్పట్లోనే సంచలనం సృష్టించారు. తమిళ సినిమాలను స్టూడియో నాలుగు గోడల మధ్య నుంచి బయటకు తీసుకువచ్చి, అవుట్‌డోర్ లోకేషన్స్‌లో సహజమైన లొకేషన్లలో షూటింగ్ చేసే ట్రెండ్‌ను ఆయనే పరిచయం చేశారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ అభిమానులు, సినీ లోకం ఆయనను గౌరవంగా “దర్శక ఇమయం” (దర్శకత్వ శిఖరం) అని పిలుచుకుంటారు.
తెలుగు సినిమాతో విడదీయరాని బంధం..
భారతీరాజా కేవలం తమిళానికే పరిమితం కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. ఆయన తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన క్లాసిక్ మూవీ ‘సీతాకోకచిలుక’. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు అందుకోవడమే కాకుండా, ఆయనకు ఉత్తమ దర్శకుడిగా ‘నంది అవార్డు’ను తెచ్చిపెట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటైన నందమూరి బాలకృష్ణ ‘మంగమ్మగారి మనవడు’ చిత్రానికి భారతీరాజానే మూలకథ అందించారు. అలాగే రాజశేఖర్ నటించిన ‘పల్నాటి పౌరుషం’ చిత్రానికి స్క్రీన్‌ప్లే సమకూర్చారు.
ఎందరో స్టార్లను పరిచయం చేసిన ఘనత..
సినిమా ఇండస్ట్రీకి నటీనటులను పరిచయం చేయడంలో భారతీరాజాది ప్రత్యేక శైలి. తన సినిమాల ద్వారా రాధిక, రాధ, రేవతి, కార్తీక్, విజయశాంతి వంటి ఎందరో నటీనటులను వెండితెరకు పరిచయం చేసి, వారిని స్టార్స్‌గా మార్చిన ఘనత ఆయనది. ‘సిగప్పు రోజక్కల్’ (ఎర్ర గులాబీలు), ‘కిజక్కే పోగుం రైల్’ (తూర్పు వెళ్లే రైలు), ‘అలైగల్ ఓయ్వతిల్లై’ (సీతాకోకచిలుక తమిళ వర్షన్), ‘ముదల్ మరియాదై’, ‘కరుత్తమ్మ’ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలు ఆయన కలం నుంచి జాలువారినవే.
అవార్డులు – పురస్కారాలు..
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో అరుదైన గౌరవాలు ఆయన్ను వరించాయి. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2004లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో ఆయనను సత్కరించింది. ఆయన అవార్డుల ఖాతాలో 6 నేషనల్ అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులతో పాటు పలు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ అవార్డులు ఉన్నాయి.
నటుడిగానూ మెప్పించి..
కేవలం మెగాఫోన్ పట్టడమే కాకుండా, నటుడిగానూ భారతీరాజా తనదైన ముద్ర వేశారు. మణిరత్నం తెరకెక్కించిన ‘ఆయుధ ఎళుత్తు’ (యువ), ‘పాండియా నాడు’ (పల్నాడు), ఇటీవల ధనుష్ నటించిన ‘తిరుచిత్రంబలం’ (తిరు) వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి నటుడిగానూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. భారతీరాజా మరణవార్త విన్న సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక గొప్ప దృశ్య కావ్యాల సృష్టికర్తను కోల్పోయామంటూ నివాళులర్పిస్తున్నారు.
