
Chennai Love Story Trailer: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. ప్రేమ, భావోద్వేగాలు, విధి కలిసి ఇద్దరు యువతీయువకుల జీవితాలను ఎలా మలుస్తాయో హృద్యంగా చూపిస్తూ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. స్టీవెన్, నివి పాత్రల చుట్టూ సాగే ఈ ప్రేమకథలో యూత్‌ను ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులను కదిలించే భావోద్వేగ క్షణాలు కూడా కనిపిస్తున్నాయి. విడుదలైన కొద్ది సేపటికే ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ అభిమానుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. ప్రేమలోని ఆనందం, బాధ, కలలు, జీవితాన్ని మార్చే నిర్ణయాలను దర్శకుడు రవి నంబూరి సహజంగా ఆవిష్కరించినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
ముఖ్యంగా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ మధ్య కెమిస్ట్రీ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్‌లో వినిపించిన “ఈ రోజు నుంచి మీరు నా దేవత… నేను మీ బానిస” అనే డైలాగ్స్ ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు మరింత బలం చేకూర్చగా, విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎస్‌కేఎన్, సాయి రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నండగా, ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ‘చెన్నై లవ్ స్టోరీ’ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.













