
K-Ramp: ‘కె-ర్యాంప్’ (K-Ramp) సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జైన్స్ నాని తన తొలి ప్రయత్నంతోనే మంచి గుర్తింపుతో పాటు అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, యుక్తి తరేజా హీరోయిన్గా నటించిన ఈ రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్లో సాయికుమార్, నరేష్ కీలక పాత్రలు పోషించారు. 2025 అక్టోబర్ 18న దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
తన తొలి సినిమా విజయంతో జైన్స్ నాని ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆయన ఇప్పటికే అక్కినేని నాగ చైతన్య కోసం ఓ కొత్త స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హీరో నితిన్‌కూ కూడా ఆయన కథను వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండు ప్రాజెక్టుల్లో ముందుగా ఏది పట్టాలెక్కుతుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. నాగ చైతన్యతో సినిమా ఫైనల్ అవుతుందా? లేక నితిన్‌తో జైన్స్ నాని చేతులు కలుపుతారా? అనే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. ప్రస్తుతం నాగ చైతన్య ‘వృషకర్మ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘విరూపాక్ష’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకలతో పాటు, ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నితిన్, ఈసారి గట్టి కమ్‌బ్యాక్ కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన తన మూడు ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టి, మళ్లీ విజయాల బాట పట్టాలని ప్రయత్నిస్తున్నారు. జైన్స్ నాని నెక్ట్స్ సినిమా ఎవరితో ఉండబోతోందన్నదానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు నాగ చైతన్య, నితిన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే.













