
Nayanthara vs Regina: నయనతార ప్రధాన పాత్రలో 2020లో వచ్చిన ‘మూకుత్తి అమ్మన్’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘మూకుత్తి అమ్మన్ 2’ తెరకెక్కుతోంది. సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అన్‌లిమిటెడ్ కామెడీతో పాటు ఎగ్జయిటింగ్ స్టోరీతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుందని సమాచారం. దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీలోనూ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇక సీక్వెల్‌లోనూ నయనతార టైటిల్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈసారి కథలో రెజీనా కసాండ్రా కీలకమైన ప్రతినాయక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కనిపించని సరికొత్త లుక్‌లో రెజీనా కనిపించనుండగా.. ఆమె పాత్రకు ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, లోతైన క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర రెజీనా కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ రోల్స్‌లో ఒకటిగా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్. ముఖ్యంగా నయనతార, రెజీనా మధ్య సాగే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ఇద్దరి మధ్య జరిగే పోరాటాన్ని ‘క్లాష్ ఆఫ్ టైటాన్స్’గా అభివర్ణిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను డిస్నీ+ హాట్‌స్టార్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుందట. ఫస్ట్ పార్ట్‌కి మించి వినోదం, భారీ స్కేల్, ఆసక్తికరమైన పాత్రలతో ‘మూకుత్తి అమ్మన్ 2’ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
