Shekar Master: ‘దబిడి దిబిడి’ స్టెప్‌పై శేఖర్ మాస్టర్ రిగ్రెట్.. అప్పట్లో అలా అనుకోలేదట!

Shekar Master

Shekar Master: నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాలోని ‘దబిడి దిబిడి’ పాట ఎంత పాపులర్ అయిందో.. అదే స్థాయిలో ఆ పాటలోని ఓ స్టెప్ వివాదానికి దారితీసింది. ముఖ్యంగా బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా మధ్య చిత్రీకరించిన కొన్ని స్టెప్పులపై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా ఈ వివాదాస్పద స్టెప్‌పై కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘దబిడి దిబిడి’ పాటకు తానే కొరియోగ్రఫీ చేసినట్లు శేఖర్ మాస్టర్ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఆ పాటలోని ఓ స్టెప్‌ను కంపోజ్ చేసినందుకు బాధపడుతున్నానని, రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని తెలిపారు. ఆ సమయంలో పాట స్వభావానికి, స్పెషల్ సాంగ్‌కు తగ్గట్టుగానే స్టెప్పులను రూపొందించానని చెప్పారు.

తాను రూపొందించిన స్టెప్‌ను ప్రేక్షకులు మరో కోణంలో అర్థం చేసుకోవడంతోనే అది వివాదంగా మారిందని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు. తన ఉద్దేశం ఎలాంటి వివాదాన్ని సృష్టించడం కాదని ఆయన స్పష్టం చేశారు. పాటకు కావాల్సిన ఎనర్జీ, మాస్ అప్పీల్‌ను దృష్టిలో పెట్టుకునే కొరియోగ్రఫీ చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే, ‘దబిడి దిబిడి’ పాటకు తానే కొరియోగ్రఫీ చేశాననే విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియదని శేఖర్ మాస్టర్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆయన చేసిన ఈ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అప్పట్లో వివాదానికి కారణమైన స్టెప్‌పై కొరియోగ్రాఫర్ స్వయంగా రిగ్రెట్ వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది.