
Preity Zinta: సినీ రంగంలో నెపోటిజం, పరిచయాలు, బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగానే అవకాశాలు వస్తాయనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. దీనిపై తాజాగా సీనియర్ స్టార్ హీరోయిన్, డింపుల్ బ్యూటీ ప్రీతి జింటా చేసిన కామెంట్స్ బీ-టౌన్లో హాట్ టాపిక్‌గా మారాయి. చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేదో, ఎలాంటి అండదండలు లేని వారు నిలదొక్కుకోవడం ఎంత నరకప్రాయంగా ఉండేదో ఆమె కుండబద్దలు కొట్టారు. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘బట్వారా 1947’, ‘వైబ్’ చిత్రాలతో రీఎంట్రీ ఇచ్చిన ప్రీతి జింటా.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినీ ప్రయాణపు తొలినాళ్ల జ్ఞాపకాలను పంచుకుంటూ నాటి కఠిన పరిస్థితులను బయటపెట్టారు.
నేటి తరంతో పోలిస్తే తాము చిత్రసీమలోకి అడుగుపెట్టిన రోజులు ఎంతో భిన్నంగా ఉండేవని ప్రీతి జింటా స్పష్టం చేశారు. “ఈ రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారింది. ఎక్కడో మారుమూల చిన్న పట్టణంలో ఉన్న వ్యక్తి కూడా తన ఇంట్లో కూర్చునే ఫోన్లో ఆడిషన్ వీడియో తీసి కాస్టింగ్ డైరెక్టర్లకు పంపగలుగుతున్నాడు. సోషల్ మీడియా పుణ్యమా అని టాలెంట్ ఉంటే ఎక్కడో ఒకచోట సులభంగా గుర్తింపు దక్కుతోంది. కానీ మా రోజుల్లో పరిస్థితి అలా ఉండేది కాదు. ఇండస్ట్రీలో రాణించాలంటే లోపల ఎవరో ఒకరు తెలిసి ఉండాలి. పరిచయాలు ఉంటేనే కనీసం తలుపులు తెరుచుకునేవి. అప్పట్లో టాలెంట్‌ను వెతికే కాస్టింగ్ డైరెక్టర్లు లేరు, ఇంతటి టెక్నాలజీ కూడా లేదు” అంటూ నాటి చేదు వాస్తవాలను గుర్తుచేసుకున్నారు.
సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితోనే స్టార్డమ్ తెచ్చుకున్నప్పటికీ, ఆ ప్రయాణం ఒంటరిగా సాధ్యం కాలేదని ప్రీతి మనసు విప్పి మాట్లాడారు. “నేను సొంతంగానే ఎదిగాను, కానీ నా ఎదుగుదల వెనుక ఇండస్ట్రీ లోపలా, బయటా అండగా నిలిచిన ఎందరో వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా తన కెరీర్ స్టార్టింగ్‌లో నటుడు బాబీ దేఒల్ ఎంతో తోడుగా నిలిచారు. జీవితంలో ఎవరూ ఒంటరిగా విజయ శిఖరాలను అధిరోహించలేరు. అలాగే నా మొదటి సినిమా ‘దిల్ సే’ చేస్తున్నప్పుడు షారుక్ ఖాన్, మనీషా కొయిరాలా వంటి దిగ్గజాల నుంచి నటనలోని మెళకువలను ఎన్నో నేర్చుకున్నాను” అని చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్స్, పరిచయాలు ఉంటేనే అడుగుపెట్టే రోజులను దాటుకుని.. ఇవాళ ఎవరైనా సరే ప్రతిభతో గుర్తింపు సాధించే స్థాయికి సినిమా రంగం మారడం గొప్ప పరిణామమని ఆమె అభిప్రాయపడ్డారు. తన అనుభవాల ద్వారా బాలీవుడ్ గతాన్ని కళ్లకు కడుతూ ప్రీతి జింటా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట సినీ ప్రియుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.














