
Trivikram Srinivas: తెలుగు చిత్రసీమలో తన పదునైన సంభాషణలతో, భావగర్భితమైన మాటలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక స్టార్ హీరో పేరు చెబితే ఇప్పటికీ గజగజ వణికిపోతారట. ఆయనెవరో కాదు.. విక్టరీ హీరో వెంకటేష్. తాజాగా జరిగిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలోని ‘నారాయణమ్మ’ పాట విడుదల వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రస్థానానికి సంబంధించి ఎవరూ ఊహించని నిజాన్ని బయటపెట్టారు. “టాలీవుడ్లో నా ఫేవరెట్ హీరో వెంకటేష్ గారు. నా సినీ ప్రయాణంలో తొలిసారి పెన్ను పట్టి సంభాషణలు రాసింది ఆయన నటించిన ‘పవిత్ర బంధం’ సినిమాకే. ఆ తర్వాత ‘పెళ్లి చేసుకుందాం’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి చిత్రాలతో మా అనుబంధం కొనసాగింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికీ వెంకటేష్ గారిని చూస్తే నాలో ఏదో తెలియని వణుకు, భయం మొదలవుతాయి. ఆయన నాతో ఎంత ఆప్యాయంగా, క్లోజ్‌గా మాట్లాడినా సరే.. నా మనసులో ఆ దూరం, ఆ బెరుకు అలానే ఉండిపోతాయి. బహుశా మొదట్లో ఆయన్ని చాలా దూరం నుంచి అభిమానించడం వల్లనో, లేదా ఆయన మీద ఉన్న అమితమైన గౌరవంతో కూడిన ఇష్టం వలనో తెలియదు కానీ.. ఆ భయం మాత్రం ఇప్పటికీ పోలేదు” అంటూ మనసులోని మాటను పంచుకున్నారు.
కెరీర్లో 76 సినిమాలు పూర్తి చేసుకున్నప్పటికీ వెంకటేష్‌లో సినిమా పట్ల ఉన్న అంకితభావం ఏమాత్రం తగ్గలేదని త్రివిక్రమ్ కొనియాడారు. “ఒకసారి డేట్స్ ఇచ్చి ప్రాజెక్ట్‌కు కమిట్ అయితే, దాన్ని సమయానికి పూర్తి చేయాలనే తపన ఆయనలో అద్భుతంగా ఉంటుంది. నిన్నటివరకు ఒంట్లో నలతగా ఉన్నప్పటికీ, మా టైమ్‌లైన్స్‌కు ఎక్కడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వచ్చి డబ్బింగ్ పూర్తి చేసి ఇచ్చారు. సినిమా మీద ఆయనకున్న వర్రీ, అంకితభావానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే” అని ప్రశంసించారు.
ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నువ్వు నాకు నచ్చావ్’ రోజుల నుంచి ఇప్పటివరకు వెంకటేష్‌లో ఎలాంటి మార్పు రాలేదని త్రివిక్రమ్ తేల్చి చెప్పారు. “ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘ఆనందో బ్రహ్మ’ నవలలో యాజి అనే పాత్ర ఉంటుంది. అందులో చివర్లో ఒక మాట వస్తుంది.. ‘వయసు ఏమాత్రం ప్రభావం చూపించని గొంతు అవతలి నుంచి వినిపించింది’ అని. సరిగ్గా వెంకటేష్ గారు కూడా అంతే! వయసు ఏమాత్రం ప్రభావం చూపించని కొద్దిమంది వ్యక్తుల్లో వెంకటేష్ గారు ఒకరు. ఆయనలో రూపం పరంగా గానీ, ఎనర్జీ పరంగా గానీ ఎలాంటి మార్పు రాలేదు” అంటూ ఆసక్తికర పోలికను వివరించారు.
ఈ పాటలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులపై కూడా త్రివిక్రమ్ ప్రశంసలు కురిపించారు. “ఈ పాట చిత్రీకరణ సమయంలో నటి డింపుల్ హయతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. షూటింగ్ డేట్స్ కుదరక మేం ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చినప్పటికీ, ఏమాత్రం విసుక్కోకుండా సెట్‌కు వచ్చి ఎంతో ఇష్టపడి పనిచేశారు. రాబోయే రోజుల్లో ఆమెతో పూర్తిస్థాయి సినిమాలో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. అలాగే సంగీత దర్శకుడు తమన్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రిలతో తనకు పాతికేళ్లకు పైగా ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సరదా కామెంట్స్ చేశారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాటల మాంత్రికుడు వేదికపై చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.














