
Rahul Roy: మహేష్ భట్ దర్శకత్వంలో 1990లో వచ్చిన బాలీవుడ్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఆషికి’ హీరో రాహుల్ రాయ్ ఈ సినిమాతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని యూత్ ఐకాన్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితిపై కీలక విషయాలను వెల్లడించారు. 2020లో కార్గిల్‌లో సినిమా షూటింగ్ సమయంలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన సమయంలో తన పరిస్థితి చూసి తీవ్రంగా భయపడినట్లు రాహుల్ రాయ్ గుర్తుచేసుకున్నారు. మళ్లీ తాను సాధారణంగా నడవగలనా? మాట్లాడగలనా? అనే ఆందోళన కలిగిందని చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు, వైద్యుల సహకారంతో క్రమంగా కోలుకున్నట్లు వెల్లడించారు.
ఆరోగ్య సమస్యల నుంచి కోలుకునే క్రమంలో ప్రస్తుతం రోజుకు ఎనిమిది రకాల మందులు తీసుకుంటున్నట్లు రాహుల్ రాయ్ తెలిపారు. అంతేకాకుండా తన జీవనశైలిలోనూ అనేక మార్పులు చేసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా స్మోకింగ్ పూర్తిగా మానేశానని వెల్లడించారు. ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకున్న రాహుల్ రాయ్.. ప్రస్తుతం వీగన్, జైన్ డైట్‌ను అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఈ డైట్లో భాగంగా ఉల్లి, వెల్లుల్లి, పాలు వంటి పదార్థాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత ఎదురైన అనేక ఆరోగ్య సవాళ్లను అధిగమించి.. రాహుల్ రాయ్ మళ్లీ నటనపై దృష్టి పెట్టడం విశేషం. తాజాగా ‘సూపర్ బాద్షా’ సిరీస్ ద్వారా తిరిగి తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ‘ఆషికి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రాయ్.. ఇప్పుడు ఆరోగ్య సమస్యలను అధిగమించి తిరిగి కెమెరా ముందుకు రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.














