
Chiranjeevi: వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి చేసే సందడి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తన డ్యాన్సులు, డైలాగులతోనే కాదు, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వుల పంట పండించడంలో ఆయన శైలే వేరు. ఇప్పుడదే వినోదాన్ని డిజిటల్ స్క్రీన్‌పై సరికొత్తగా ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరంజీవి హోస్ట్‌గా రాబోతున్న సరికొత్త సెలబ్రిటీ టాక్ షో ప్రస్తుతం ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ క్రేజీ షోకు సంబంధించిన అన్ని డీల్స్ పూర్తవడమే కాకుండా, తాజాగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో తొలి ఎపిసోడ్ చిత్రీకరణ కూడా ప్రారంభమైంది.
తొలి ఎపిసోడ్‌తోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను షేక్ చేయాలని ప్లాన్ చేసిన నిర్వాహకులు, ఒకే వేదికపైకి టాలీవుడ్ టాప్ కమెడియన్లను తీసుకొచ్చారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, స్టార్ కమెడియన్ సునీల్, ప్రస్తుత ట్రెండింగ్ ఎంటర్టైనర్ సత్య ఈ తొలి ఎపిసోడ్లో సందడి చేసినట్లు ఫిలింనగర్ టాక్. గతంలో ‘శంకర్‌దాదా MBBS’, ‘ఇంద్ర’ వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో చిరు-బ్రహ్మీ కాంబినేషన్ సృష్టించిన నవ్వుల సునామీ అంతా ఇంతా కాదు. ఇప్పుడు వారిద్దరికీ సునీల్, సత్య తోడవ్వడంతో సెట్లో కామెడీ డోస్ నెక్స్ట్ లెవెల్‌కి చేరిందని సమాచారం. చిరంజీవి తనదైన మార్క్ హ్యూమర్, సెటైర్లతో ఈ ముగ్గురితో కలిసి చేసిన అల్లరి ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక టాక్ షోను హోస్ట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవికి నెట్‌ఫ్లిక్స్ ఊహించని రీతిలో భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సౌత్ ఇండియాలోనే ఒక సెలబ్రిటీ షోకు ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడం ఇదే ప్రథమం అంటున్నారు. మరోవైపు చిరంజీవి వరుస సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. భారీ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’తో పాటు ‘కాకా’ చిత్రాల నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ, వాటిని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు పక్కా ప్లాన్‌తో దూసుకెళ్తున్నారు. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు, మరోవైపు డిజిటల్ ఎంట్రీతో మెగాస్టార్ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి రావడం అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.













