Janhvi Kapoor: అమ్మ చనిపోయిన రోజు శిఖర్ చదువు ఆపేసి ముంబై వచ్చాడు

Janhvi Kapoor

Janhvi Kapoor: జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో తోడుగా నిలిచే వ్యక్తే నిజమైన ప్రేమకు నిదర్శనం. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జీవితంలో అలాంటి ఒక అపురూపమైన బంధం ఉంది. జాన్వీ – శిఖర్ పహారియా గురించి ఇప్పటికే ఎన్నో రూమర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ, తాజాగా ఆమె బయటపెట్టిన ఓ భావోద్వేగ సంఘటన అందరి హృదయాలను కదిలిస్తోంది. తన తల్లి, అలనాటి అందాల తార శ్రీదేవి హఠాన్మరణం చెందిన సమయంలో శిఖర్ చూపించిన ప్రేమ, చేసిన త్యాగం గురించి జాన్వీ మొదటిసారి మనసు విప్పి మాట్లాడారు. ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ (సీజన్-9) తాజా ఎపిసోడ్‌లో హీరో వరుణ్ ధావన్‌తో కలిసి పాల్గొన్న జాన్వీ, ఆ చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

‘‘అమ్మ చనిపోయిన వార్త తెలిసిన క్షణంలో శిఖర్ లండన్‌లో చదువుకుంటున్నాడు. ఆ బాధాకరమైన విషయం వినగానే ఏమాత్రం ఆలోచించకుండా తన కాలేజ్ సెమిస్టర్‌ను సైతం మధ్యలోనే వదిలేసి వెంటనే ముంబయికి ఫ్లైట్ ఎక్కేశాడు’’ అని జాన్వీ తెలిపారు. అంతటితో ఆగకుండా, ఆమెకు ఏ కష్టం వచ్చినా క్షణాల్లో తోడుగా ఉండేందుకు శిఖర్ తీసుకున్న నిర్ణయం మరింత హృద్యంగా అనిపిస్తుంది. ‘‘సాధారణంగా అతడు టౌన్‌లో ఉండే తన తండ్రి దగ్గర ఉండాలి. కానీ నా ఇంటికి దగ్గరగా ఉంటే, నాకు ఏ అవసరం వచ్చినా వెంటనే చేరుకోవచ్చని భావించి జుహులోని తన స్నేహితుడి ఇంటికి మకాం మార్చాడు. దాదాపు నెల రోజుల పాటు నన్ను కనిపెట్టుకుని అక్కడే గడిపాడు. ఆ సమయంలో అతడు నా కోసం ఇంత చేశాడన్న విషయం నాకు చాలా రోజుల తర్వాతే తెలిసింది’’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ ఇద్దరి ప్రేమాయణం గురించి ఇండస్ట్రీలో ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నా, వారి మధ్య ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమే కాదు.. ఒకరికొకరు ప్రాణమిచ్చేంత అనుబంధం అని జాన్వీ మాటలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. కష్టకాలంలో వెన్నంటి నిలిచి, జాన్వీకి కొండంత అండగా మారిన శిఖర్ పహారియా ప్రవర్తన ఇప్పుడు నెట్టింట అందరి ప్రశంసలు అందుకుంటోంది. సినిమాటిక్ లవ్ స్టోరీలను తలదన్నేలా ఉన్న బంధం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.