
Trivikram: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మైక్ పట్టుకుంటే మాటలు తూటాల్లా పేలడమే కాదు.. ఆలోచింపజేసే జీవిత సత్యాలు బయటకు వస్తాయి. తాజాగా వెంకటేష్ సినిమా వేదికపై ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చెప్పిన ‘ఉద్ధవ గీత’ను నేటి ఆధునిక సమాజానికి, ముఖ్యంగా నేటి సోషల్ మీడియా విష సంస్కృతికి లింక్ చేస్తూ ఆయన చేసిన కామెంట్లు ఆలోచింపజేస్తున్నాయి.
కురుక్షేత్రంలో అర్జునుడికి గీతోపదేశం చేసిన సంగతి అందరికీ తెలుసు. కానీ తన కళ్ల ముందే యాదవ వంశం మొత్తం ఒకరినొకరు చంపుకుంటూ అంతమైపోతుంటే.. శ్రీకృష్ణుడు అరణ్యానికి బయలుదేరిన సమయంలో ఉద్ధవుడికి చెప్పిన రహస్య జ్ఞానమే ‘ఉద్ధవ గీత’. దీని గురించి త్రివిక్రమ్ వివరిస్తూ.. రాబోయే కాలంలో మనుషులు ఎలా ఉంటారో 5000 సంవత్సరాల క్రితమే కృష్ణుడు స్పష్టంగా చెప్పాడన్నారు. ప్రధానంగా మనుషుల్లో మూడు వికృత లక్షణాలు రాజ్యమేలుతాయని ఉద్ధవ గీతలో ఉందన్నారు. ఏది ఉన్నా తృప్తి లేకపోవడం, ఎంత దక్కినా ఇంకా కావాలనే పైశాచిక కాంక్ష, ఎలాగైనా సరే నాకు ఇదే కావాలని మొండిగా ప్రవర్తించడం, ఎదుటివారితో గొడవలు పెట్టుకోవడం, లేదా ఇద్దరు కొట్టుకుంటుంటే చూసి పైశాచిక ఆనందం పొందడం.
“ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నది అక్షరాలా అదే. ఇంటర్నెట్లో ఒక మంచి ఫోటో పెడితే మెచ్చుకుంటూ రెండు కామెంట్లు వస్తే.. కింద పనిగట్టుకుని తిడుతూ ఇరవై కామెంట్లు పెడతారు. ఆ కలహ ప్రియత్వమే మనుషుల్లో విషాన్ని నింపుతోంది” అంటూ త్రివిక్రమ్ ఘాటు విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి మిగిలిన ఏకైక రక్షణ కవచం ‘కుటుంబం’ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కుటుంబం అనేది ఎప్పటికీ ఎండిపోని అమృతపు బావి లాంటిదని, సమాజం విసిరే పద్మవ్యూహంలోకి వెళ్లి అభిమన్యుడిలా ప్రాణాలు కోల్పోతామా లేక అర్జునుడిలా గెలిచి వస్తామా అన్నదే నేటి కుటుంబాల అసలైన పరీక్ష అని తేల్చిచెప్పారు. వెంకటేష్ లాంటి హీరోతో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం సినిమా మాత్రమే కాదని, ముక్కలైపోతున్న బంధాలను నిలబెట్టే ప్రయత్నమని త్రివిక్రమ్ ఉద్వేగంగా వెల్లడించారు.













