
Varanasi: భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికలపై సగర్వంగా నిలబెట్టిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అడ్వెంచర్ విజువల్ వండర్ ‘వారణాసి’. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను కేవలం భారతీయ మార్కెట్‌కే పరిమితం చేయకుండా, హాలీవుడ్ ప్రేక్షకులను నేరుగా టార్గెట్ చేస్తూ రాజమౌళి వేస్తున్న అడుగులు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపుతున్నాయి.
ఈ చిత్ర విడుదల విషయంలో జక్కన్న పెట్టుకున్న ఒకే ఒక్క లక్ష్యం ఇప్పుడు ప్రపంచ సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన కెరీర్లోనే మునుపెన్నడూ చూడని రీతిలో ‘వారణాసి’ని ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎత్తున (బిగ్గెస్ట్ గ్లోబల్ రిలీజ్) విడుదల చేయాలని రాజమౌళి దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇటీవల హాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన సందర్భంగా ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘RRR’ చిత్రానికి ఓటీటీలో వచ్చిన అద్భుతమైన అంతర్జాతీయ స్పందన చూసి తాము విస్మయానికి గురయ్యామని, ఆ తర్వాత ఏకంగా నలభైకి పైగా దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ చేసి ఘన విజయం సాధించామని గుర్తుచేశారు.
ఆ అనుభవం ఇచ్చిన అపారమైన ధైర్యంతోనే ఇప్పుడు ‘వారణాసి’కి అంతకు మించిన స్థాయి ప్రణాళికను సిద్ధం చేశారు. పాశ్చాత్య ప్రేక్షకులను తొలిరోజు నుంచే థియేటర్లకు రప్పించేలా భారీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు మహేష్ బాబు అల్ట్రా మాస్ అండ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, మరోవైపు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ప్రియాంక చోప్రా క్రేజ్ తోడుకావడంతో, హాలీవుడ్ అగ్ర చిత్రాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ‘వారణాసి’ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రంగం సిద్ధమైంది.














