Neha Sharma : ‘చిరుత’ చిత్రంతో రామ్ చరణ్ సరసన తెలుగు తెరకు పరిచయమైన నటి నేహా శర్మ ఇప్పుడు బాలీవుడ్‌లో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నారు. ఇప్పటి వరకు నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఈసారి కెమెరా వెనుకకు వెళ్లి దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకోబోతున్నారని సమాచారం. బాలీవుడ్ మీడియా వర్గాల టాక్ ప్రకారం, నేహా శర్మ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ నిర్మించనున్నారని తెలుస్తోంది. 1945 కాలం నేపథ్యంగా సాగే పీరియాడిక్ డ్రామా రూపంలో సినిమా తెరకెక్కనుందనే ప్రచారం ఉంది. ఇందులో యువ నటులు సిద్ధాంత్ చతుర్వేది, మోహిత్ ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తెలుగులో చిరుత తర్వాత నేహా శర్మ వరుణ్ సందేశ్‌తో కలిసి కుర్రాడు చిత్రంలో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. హిందీతో పాటు తమిళం, మలయాళం, పంజాబీ చిత్రాల్లోనూ నటించారు. ఇప్పుడు దర్శకత్వంలో అడుగుపెట్టడం ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

