
Rahul Ravindran: సినిమా వేదికలపై సాధారణంగా ప్రశంసలు, సినిమా ముచ్చట్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ కొన్నిసార్లు అక్కడ వ్యక్తమయ్యే స్వచ్ఛమైన అనుబంధాలు అందరి హృదయాలను హత్తుకుంటాయి. తాజాగా ‘రణబాలి’ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. వేదికపై ఉన్న అందరికంటే రష్మిక మందన్న గురించే ఆయన అత్యంత భావోద్వేగంతో మాట్లాడిన తీరు, ఆమెపై చూపించిన అపరిమితమైన ప్రేమ అభిమానులను కట్టిపడేసింది.
2015 సంవత్సరాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ రాహుల్ రవీంద్రన్ మాట్లాడారు. ఆ ఏడాది కాలేజీ చదువుల నుంచి నేరుగా సినీ రంగానికి ఆడిషన్ ఇచ్చి వచ్చిన ఒక అమ్మాయే నేటి నేషనల్ క్రష్ రష్మిక అని చెప్పారు. “ఈ సినిమాలో నాకు కావాల్సిన వాళ్లు చాలామంది ఉన్నప్పటికీ.. వీళ్లందరి కంటే నాకు బాగా కావాల్సిన అమ్మాయి రష్మిక. నేను ఈరోజు ఈ ఈవెంట్‌కు వచ్చింది నీకోసమే రష్మిక.. నీకోసం నేను ఎక్కడికైనా వస్తాను. నీపై నాకున్న అభిమానాన్ని, ప్రేమను వ్యక్తపరచడానికి ఇప్పుడున్న భాషలు ఏవీ సరిపోవు, కొత్త భాషే కనిపెట్టాలి. నువ్వు నాకు సొంత కుటుంబం!” అంటూ రాహుల్ చెప్పిన మాటలకు ఆడిటోరియం మొత్తం కేరింతలతో హోరెత్తిపోయింది.
రష్మికతో ఉన్న అనుబంధం గురించే కాకుండా, ఆమెతో ముడిపడిన విజయ్ దేవరకొండ సాన్నిహిత్యాన్ని కూడా ఆయన బయటపెట్టారు. “నువ్వు నాకు ఫ్యామిలీ.. ఇప్పుడు నీ వల్లే విజయ్ కూడా నాకు ఫ్యామిలీ అయ్యాడు. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే బాగుండాలి” అంటూ ఓపెన్‌గా చెప్పేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతేకాదు, విజయ్ దేవరకొండతో తనకు ప్రత్యేకమైన సాన్నిహిత్యం ఉందని, తామిద్దరం కలిసినప్పుడల్లా గడియారాల (వాచెస్) గురించే ఆసక్తిగా మాట్లాడుకుంటామని సరదాగా వెల్లడించారు.
దర్శకుడు రాహుల్ సంకృత్యన్ మొదటి ప్రయత్నాలు, మైత్రీ మూవీ మేకర్స్ మొదలైన రోజులు, సంగీత దర్శకులు అజయ్-అతుల్లతో ఏర్పడిన బంధం, అలాగే 2015లో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చూసి విజయ్ దేవరకొండ కచ్చితంగా పెద్ద స్టార్ అవుతాడని తాను నమ్మిన క్షణాలు.. ఇలా ప్రతి ఒక్కరి ప్రయాణం 2015లోనే మొదలైందని రాహుల్ నెమరువేసుకున్నారు. వాళ్లంతా కలిసి నేడు ‘రణబలి’ రూపంలో ఒక భారీ విజువల్ వండర్‌తో ముందుకు రావడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ముగించారు.
