
Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా అంటేనే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన.. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. రాజమౌళి నెక్ట్స్ హీరో ఎవరనే ప్రశ్న పాన్ వరల్డ్ స్థాయిలో ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. గతంలో ‘బాహుబలి 2’ తర్వాత రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. కేవలం 204 రోజుల్లోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఆ తర్వాత అదే ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’గా రూపుదిద్దుకుని ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ‘వారణాసి’ తర్వాత కూడా రాజమౌళి ఇదే తరహా స్పీడ్ చూపిస్తారా అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.
ప్రస్తుతం జక్కన్న నెక్ట్స్ హీరోల రేసులో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పాన్ ఇండియా ఇమేజ్, భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌కు అవసరమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, పాత్ర కోసం ఎక్కువ సమయం కేటాయించే సామర్థ్యం వంటి అంశాలు బన్నీకి ప్లస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ డేట్స్, ఇప్పటికే ఉన్న కమిట్‌మెంట్స్ రాజమౌళి ప్రాజెక్ట్‌కు ఎంతవరకు అనుకూలిస్తాయనేది ఇక్కడ కీలకంగా మారింది. తెలుగు ఇండస్ట్రీకి బయట చూస్తే కన్నడ స్టార్ హీరో యశ్ పేరు కూడా బలమైన ఆప్షన్‌గా కనిపిస్తోంది. ‘కేజీఎఫ్’ సిరీస్ కోసం ఏళ్ల తరబడి ఒకే ప్రపంచంలో ట్రావెల్ చేసిన యశ్.. భారీ ప్రాజెక్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయించే విషయంలో తన కమిట్‌మెంట్‌ను ఇప్పటికే నిరూపించుకున్నాడు. దీంతో రాజమౌళి – యశ్ కాంబినేషన్‌పై కూడా సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరోవైపు తమిళ స్టార్ హీరో సూర్య పేరు కూడా కొంతకాలంగా రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించి వినిపిస్తోంది. అయితే అల్లు అర్జున్, యశ్, సూర్య.. వీరిలో ఎవరితో రాజమౌళి సినిమా చేయనున్నారనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ‘బాహుబలి 2’ తర్వాత కేవలం 204 రోజుల్లోనే తన నెక్ట్స్ కాంబినేషన్‌పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న.. ‘వారణాసి’ తర్వాత కూడా అదే వేగంతో ముందుకు దూసుకువెళ్తారా? 2027లోనే తన నెక్ట్స్ హీరోను ప్రకటిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బన్నీనా.. యశ్‌నా.. సూర్యనా.. లేక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మరో స్టార్ హీరోను ఎంచుకుంటారా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
