
96 Movie: కోలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ రొమాంటిక్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన చిత్రం ‘96’. విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేమకథల నిర్వచనాన్నే మార్చేసింది. రామ్, జాను పాత్రలు సినీ ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. తమిళనాట అక్టోబర్ 9న ఈ మూవీ గ్రాండ్‌గా రీ-రిలీజ్ అయి మరోసారి హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఓ క్రేజీ రూమర్‌పై దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్ నేరుగా స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
‘96’లో క్లాసిక్ పాత్రగా నిలిచిన ‘జాను’ క్యారెక్టర్ కోసం మేకర్స్ మొదట సీనియర్ హీరోయిన్ జ్యోతికను సంప్రదించారని, ఆమె నో చెప్పడంతోనే ఆ ఛాన్స్ త్రిష వద్దకు వచ్చిందనే ప్రచారం సినీ వర్గాల్లో చాలాకాలంగా నడుస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రేమ్‌కుమార్ ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. “జాను పాత్రకు నా తొలి ఎంపిక ఎప్పటికీ త్రిషే. ఆ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని నేను అసలు ఊహించుకోలేదు. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే విజయ్ సేతుపతి, త్రిషల ముఖాలే నా మనసులో మెదిలాయి. జ్యోతిక గారిని సంప్రదించారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు” అని కుండబద్దలు కొట్టారు.
అయితే ఆ ప్రాజెక్ట్ మొదలయ్యే సమయంలో ఎదురైన సవాళ్లను ఆయన బయటపెట్టారు. “అప్పట్లో త్రిష వరుస ప్రాజెక్టులతో విపరీతమైన బిజీగా ఉండేవారు. ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో షూటింగ్ ఆలస్యమైంది. దీంతో త్రిషను పక్కనపెట్టి వేరే హీరోయిన్‌తో సినిమా కానిచ్చేయాలని నాపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. అయినా నేను వెనక్కి తగ్గలేదు. త్రిష అయితేనే ఈ పాత్ర పండుతుందని మొండిగా వేచి చూశాను. చివరకు త్రిష కూడా తన డేట్స్ షెడ్యూల్ మార్చుకుని డేట్స్ ఇవ్వడంతో అంతా కుదిరింది” అంటూ నాటి ఆసక్తికర పరిణామాలను గుర్తు చేసుకున్నారు.
2015 డిసెంబరులో చెన్నైని అతలాకుతలం చేసిన భారీ వరదల సమయంలో ఇంట్లో కూర్చుని ఈ కథను రాసుకున్నానని ఆయన చెప్పారు. రీసెంట్‌గా వచ్చిన ‘మెయ్యళగన్’ (తెలుగులో ‘సత్యం సుందరం’) కథ రాసేప్పుడు కూడా తన మైండ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం తమిళనాట రీ-రిలీజ్ అయిన ‘96’ చిత్రానికి దక్కుతున్న క్రేజ్ చూస్తుంటే, త్రిష కోసమే వేచి చూడాలన్న దర్శకుడి నమ్మకం ఎంత సరైనదో మరోసారి స్పష్టమవుతోంది.














