
Om: స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కాంబోలో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఓం: చాప్టర్ 1’ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సాయి పల్లవి, శ్రీలీల లాంటి స్టార్ హీరోయిన్లతో ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం విడుదలపై మరోమారు సందిగ్ధత నెలకొంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, నవంబర్ 20న రావాల్సిన ఈ సినిమాను ఏకంగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి (జనవరి 2027) నెట్టేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ పాన్-ఇండియా మూవీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 16నే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ ‘జైలర్ 2’, సూర్య చిత్రాలతో ముఖాముఖి పోరు ఎందుకన్న ఉద్దేశంతో నవంబర్ 20కి మార్చారు. తీరా ఇప్పుడు చూస్తే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్న కారణంతో నవంబర్ స్లాట్ నుంచి కూడా తప్పుకుని నేరుగా పొంగల్ రేసులోకి వెళ్లినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
ఒకే సినిమా విడుదల తేదీలు పదే పదే మారుతుండటంతో ధనుష్ అభిమానుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మేకర్స్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ఈ ప్రాజెక్ట్‌ను ఇలాగే సాగదీసే కంటే.. పక్కనపెట్టి ధనుష్ తర్వాతి చిత్రం ‘D56’ షూటింగ్‌ను మొదలుపెట్టుకోవడం ఉత్తమం” అంటూ కొందరు ఘాటు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వాయిదా ప్రచారంపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చలకు మేకర్స్ ఫుల్స్టాప్ పెడతారా లేక నిజంగానే సంక్రాంతి రేసుకే సై అంటారా అన్నది వేచి చూడాలి.














