
Ravi Teja: టాలీవుడ్‌లో సరికొత్త మాస్ కాంబినేషన్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక అదిరిపోయే అప్‌డేట్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా మరో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రెడీ అవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. కోలీవుడ్‌లో సూర్యతో ‘సింగం’ సిరీస్, విక్రమ్‌తో ‘సామి’ వంటి హై-వోల్టేజ్ చిత్రాలను తెరకెక్కించి సౌత్ ఇండియాలోనే తనదైన ముద్ర వేసిన స్టార్ డైరెక్టర్ హరి.. రవితేజ కోసం ఒక అదిరిపోయే మాస్ స్టోరీని రెడీ చేసినట్లు సమాచారం.
ఇటీవలే డైరెక్టర్ హరి రవితేజను కలిసి ఒక పవర్‌ఫుల్ వన్‌లైన్ స్టోరీని వినిపించారని, దానికి మాస్ మహారాజా కూడా సానుకూలంగా స్పందించారని టాక్. హరి మార్క్ పక్కా కమర్షియల్ ప్యాకేజీకి.. రవితేజ ఎనర్జీ తోడైతే థియేటర్లలో మాస్ జాతర ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త అవతారంలో రవితేజ నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే హరి కాంబినేషన్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. అన్ని అనుకూలిస్తే, త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.
