Site icon TeluguMirchi.com

Sambharala Yetigattu Release Date: సంక్రాంతి బరిలో సాయి దుర్గా తేజ్.. ‘సంబరాల ఏటిగట్టు’ డేట్ వచ్చేసింది!

Sambharala Yetigattu

Sambharala Yetigattu Release Date: తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి సీజన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద హీరోల సినిమాలు, భారీ ప్రాజెక్టులు ఈ పండగ సీజన్‌ను టార్గెట్ చేయడంతో ప్రతిసారి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంటుంది. అయితే వచ్చే సంక్రాంతి సీజన్‌ మాత్రం మరింత ప్రత్యేకంగా మారేలా కనిపిస్తోంది. ఏకంగా ఐదు క్రేజీ ప్రాజెక్టులు పండగ రేసులో నిలిచే అవకాశాలు కనిపిస్తుండటంతో టాలీవుడ్‌లో ఇప్పటి నుంచే సందడి మొదలైంది. సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న భారీ చిత్రం ‘SYG (సంబరాల ఏటిగట్టు)’ నుంచి తాజాగా మేకర్స్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాను 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. వెనుక భారీగా మంటలు చెలరేగుతుండగా.. ఒళ్లంతా రక్తపు మరకలతో, చేతిలో పదునైన ఆయుధంతో సాయి దుర్గా తేజ్‌ రౌద్రంగా కనిపిస్తున్న లుక్‌ ఆకట్టుకుంటోంది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రోహిత్ కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె. నిరంజన్ రెడ్డి సమర్పిస్తున్నారు. తాజా విడుదల తేదీ ప్రకటనతో ‘SYG’ సంక్రాంతి రేసులో అధికారికంగా అడుగుపెట్టింది. మరోవైపు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ (PVCU) నుంచి రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మహాకాళి’ కూడా సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈసారి పండగ బరిలో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇప్పటికే వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్‌, రవితేజ – శ్రీవిష్ణు కాంబోలోని ఎంటర్‌టైనర్‌, శర్వానంద్ – శ్రీను వైట్ల చిత్రం కూడా సంక్రాంతి సీజన్‌పై కన్నేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇలా స్టార్ హీరోలు, క్రేజీ కాంబినేషన్లు, విభిన్న జానర్ల సినిమాలు ఒకేసారి సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండటంతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ పోటీపై ఆసక్తి నెలకొంది. అయితే చివరికి ఏ సినిమాలు నిజంగా సంక్రాంతి రేసులో నిలుస్తాయో, ఏ సినిమా వాయిదా పడుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటనల వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version