Site icon TeluguMirchi.com

Sreekanth Odela: ‘జగడం’ చూసి వచ్చా.. నాలుగేళ్లు సుకుమార్ సర్ గేటు ముందే నిల్చున్నా: శ్రీకాంత్ ఓదెల

Sukumar

Sreekanth Odela: సినిమా రంగంలో పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపించారు యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తన ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద రా అండ్ రస్టిక్ విజువల్స్‌తో ప్రభంజనం సృష్టించిన ఈ క్రియేటర్, తన వెండితెర జర్నీ వెనుక దాగున్న కఠినమైన రోజులను పంచుకున్నారు. లెక్కల మాస్టారు సుకుమార్‌ను కలవడానికి ఏకంగా నాలుగేళ్ల పాటు ఆయన ఇంటి గేటు ముందే నిలబడ్డానంటూ వెల్లడించిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.

శ్రీకాంత్ చిన్నతనంలో సుకుమార్ తెరకెక్కించిన ‘జగడం’ సినిమా చూసిన క్షణం నుంచే దర్శకుడవ్వాలనే పిచ్చి మొదలైంది. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే అసిస్టెంట్ డైరెక్టర్‌గా సుకుమార్ వద్దే చేరాలని ఫిక్స్ అయ్యి హైదరాబాద్ వచ్చేశారు. అపాయింట్‌మెంట్ కోసం రోజూ ఉదయాన్నే సుకుమార్ ఇంటి ముందుకు వెళ్లి నిలబడేవారు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్ల పాటు ఆయన ఇంటి గేటు వద్దే నిరీక్షించారు. శ్రీకాంత్ పట్టుదలను గమనించిన సుకుమార్, వెంటనే అవకాశం ఇవ్వకుండా ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చూపించమన్నారు. ఆ షార్ట్ ఫిల్మ్‌లో శ్రీకాంత్ పనితనం మెచ్చిన సుకుమార్, తన దర్శకత్వ బృందంలోకి తీసుకున్నారు.

‘నాన్నకు ప్రేమతో’ సమయంలో లోకల్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో భాగమైన శ్రీకాంత్, ఆ తర్వాత ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ‘రంగస్థలం’ చిత్రానికి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వేలమంది జూనియర్ ఆర్టిస్టులను సమన్వయం చేయడం, కాస్ట్యూమ్స్ పర్యవేక్షణ, భారీ లొకేషన్ మేనేజ్‌మెంట్‌ను క్షేత్రస్థాయిలో దగ్గరుండి నేర్చుకున్నారు. సుకుమార్ మేకింగ్ స్టైల్ తన రక్తంలోనే కలిసిపోయిందని, ఆయన ఆలోచనా స్థాయిని అందుకోవడం అంత సులభం కాదని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. గురువు నుంచి ఒంటపట్టించుకున్న ఆ సూక్ష్మమైన ఎమోషన్సే తన కథలకు బలమని గుర్తుచేసుకున్నారు. సుకుమార్‌తో పాటు రాజమౌళి, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, శేఖర్ కమ్ముల వంటి మేటి దర్శకుల ప్రభావం కూడా తన రచనలపై బలంగా ఉందని శ్రీకాంత్ వివరించారు. ఎక్కడా వెనకడుగు వేయకుండా నాలుగేళ్ల పాటు గేటు బయటే నిలబడి సాధించిన ఈ విజయ ప్రస్థానం వర్ధమాన సినీ ఔత్సాహికులకు నిజమైన స్ఫూర్తిగా నిలుస్తోంది.

Exit mobile version