
Mythri Ravi: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలయికలో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ రూపొందించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద భారీ స్పందనతో దూసుకుపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ ప్రెస్ మీట్లో నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. స్టార్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబిత స్వయంగా ఫోన్ చేసి భావోద్వేగానికి గురైన విషయాన్ని బయటపెట్టడంతో పాటు, సినిమా రన్‌టైమ్‌పై వస్తున్న కామెంట్లకు ఆయన గట్టి సమాధానమిచ్చారు. సినిమా చూసిన సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న స్పందనను పంచుకుంటూ రవిశంకర్ ఒక ఆసక్తికర సంఘటనను వివరించారు.
“ఉదయం సుకుమార్ గారి వైఫ్ తబిత గారు నాకు ఫోన్ చేశారు. సాధారణంగా సినిమా విపరీతంగా నచ్చితే తప్ప ఆవిడ కాల్ చేయరు. అలాంటిది దాదాపు పావుగంట పాటు నాతో ఎమోషనల్‌గా మాట్లాడారు. ‘బ్రిటీష్ వారిపై సాధారణ స్వాతంత్ర్య పోరాటం అనుకుని వెళ్లాను.. కానీ సినిమాలో చూపించిన వేరే ప్రపంచం, భావోద్వేగాలు చూసి షాక్ అయ్యాను. ఎన్నో సన్నివేశాల్లో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సినిమా అద్భుతంగా ఉంటే మధ్యలో రన్‌టైమ్ ఎక్కువని ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు’ అని ఆమె చెప్పారు.” సినిమా నిడివిపై సోషల్ మీడియాలో వచ్చిన చిన్నపాటి చర్చలను రవిశంకర్ కొట్టిపారేశారు. ఒక భారీ పీరియడ్ కథను, అందులోని భావోద్వేగాలను పూర్తిస్థాయిలో చెప్పే క్రమంలో 5 లేదా 10 నిమిషాల రన్‌టైమ్ అదనంగా ఉండటం అత్యంత సహజమని స్పష్టం చేశారు.
ప్రేక్షకులు కథలోని తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఆ నిడివి అవసరమని, తొలి ఆటకే చిన్న సందేహం ఉన్నప్పటికీ, మ్యాట్నీ, ఫస్ట్ షోల సమయానికే ఆ టాక్ అంతా సెటిల్ అయిపోయి ప్రేక్షకుల తాకిడి విపరీతంగా పెరిగిందని తెలిపారు. కలెక్షన్ల పరంగా భారీ నంబర్ దిశగా సినిమా సాగుతోందని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతోందని గుర్తు చేస్తూ, “మంచి హిట్ రిపోర్ట్‌తో మీ ముందుకు వస్తామని ఎన్టీఆర్ గారికి ముందే చెప్పాం. ఇప్పుడు ప్రెస్ మీట్ ముగించుకుని నేరుగా ఆయనను కలవడానికి వెళ్తున్నాం” అని నిర్మాత వెల్లడించారు.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య పండిన కెమిస్ట్రీ అత్యంత వాస్తవికంగా, అద్భుతంగా వచ్చిందని రవిశంకర్ కొనియాడారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లోని ఒక కీలక ఎపిసోడ్లో వీరిద్దరి నటన చూసి థియేటర్లలో ప్రేక్షకులు షాక్ అవుతున్నారని, వారి పర్ఫార్మెన్స్కు విశేష ప్రశంసలు దక్కుతున్నాయని అన్నారు. ఈ జోడీ క్రేజ్ వల్లే ఉదయం ఆట నుంచే ఆంధ్రప్రదేశ్ అంతటా థియేటర్లకు మహిళలు, కుటుంబ ప్రేక్షకులు పోటెత్తుతున్నారని, సినిమా కచ్చితంగా ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతిని ఇస్తుందని స్పష్టం చేశారు.
