Site icon TeluguMirchi.com

Karikala: ఊహా ప్రపంచంలో సందీప్ కిషన్! రెండు భాగాలుగా ‘కరికాల’ విజువల్ వండర్

Sundeep Kishan

Karikala: ఎప్పటికప్పుడు విలక్షణమైన కథలతో ప్రేక్షకులను థ్రిల్ చేసే యంగ్ హీరో సందీప్ కిషన్ వెండితెరపై కనీవినీ ఎరుగని కొత్త లోకంలోకి అడుగుపెడుతున్నారు. నాగలోకం, వానర లోకం లాంటి విస్మయపరిచే ఊహా ప్రపంచాలను సృష్టిస్తూ.. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని మైథలాజికల్ ఫాంటసీ కాన్సెప్ట్‌తో ‘కరికాల’ అనే భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. అంతేకాదు, ఈ సినిమా ఏకంగా రెండు భాగాలుగా రూపొందుతుండటం టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. యుగంధర్ ముని దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న ఈ భారీ విజువల్ స్పెక్టాకిల్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి కెమెరా స్విచ్చాన్ చేయగా, మహిధర్ తల్లి పద్మారెడ్డి క్లాప్ కొట్టారు. హీరో ఆది సాయికుమార్ గౌరవ దర్శకత్వం వహించి స్క్రిప్ట్ అందజేతలో పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్ట్ విశేషాలను దర్శకుడు యుగంధర్ ముని పంచుకుంటూ.. ‘‘మనం చిన్నప్పుడు విన్న అద్భుతమైన చందమామ కథల రీతిలో ఈ చిత్రం ఉంటుంది. నాగలోకం, వానర లోకం లాంటి అద్భుతమైన ఊహా ప్రపంచాన్ని తెరపై సృష్టించి సినిమాను అద్భుతమైన గ్రాఫిక్స్, ఎమోషన్స్‌తో తెరకెక్కిస్తున్నాం. వచ్చే ఏడాదే రెండు భాగాలనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని స్పష్టం చేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన గ్లామరస్ తార కేథరిన్‌తో పాటు గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇంతటి బలమైన పాత్ర, గొప్ప కథ దొరకడంపై కేథరిన్ తీవ్ర ఆసక్తి వ్యక్తం చేశారు. ‘కరికాల’ సృష్టిస్తున్న కొత్త ప్రపంచం ప్రేక్షకులకు పూర్తి భిన్నమైన అనుభూతిని ఇస్తుందని మిగతా ఇద్దరు కథానాయికలు పేర్కొన్నారు. మిత్రుడు ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ సినిమా వల్లే ఈ దర్శకుడితో పరిచయం ఏర్పడిందని, కథ వినగానే ఇది రెండు భాగాలుగా చేయాల్సిన భారీ కాన్వాస్ అనిపించి వెంటనే ఒప్పుకున్నానని సందీప్ కిషన్ వెల్లడించారు.

Exit mobile version