
Srikanth Odela : న్యాచురల్ స్టార్ నాని, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే, ఆ సినిమా వచ్చి ఇంతకాలమైనా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మనసులో ఉన్న ఒక అసంతృప్తి తాజాగా బయటపడింది. ‘దసరా’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టినప్పటికీ, ప్రేక్షకులు థియేటర్లలో పూర్తిగా సంతృప్తి చెందలేదంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఆ సినిమా మిగిల్చిన వెలితిని భర్తీ చేయడానికే నానితో మళ్లీ ‘ది ప్యారడైజ్’ ప్రాజెక్ట్ మొదలుపెట్టానని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దసరా’ రిలీజ్ సమయంలో టీజర్లు, ట్రైలర్లతో వచ్చిన విపరీతమైన హైప్ వల్ల ఆడియన్స్ కేజీఎఫ్ రేంజ్ ఫుల్-లెంగ్త్ మాస్ ఊచకోతను ఊహించుకుని థియేటర్లకు వచ్చారని తెలిపారు. తీరా స్క్రీన్ మీద వెన్నెల చుట్టూ తిరిగే ప్రేమకథ, ఎమోషనల్ డ్రామా కనిపించేసరికి మాస్ ప్రేక్షకులు మొదట్లో తీవ్ర నిరాశకు గురయ్యారని ఒప్పుకున్నారు. సినిమా బాక్సాఫీస్ పరంగా సూపర్ హిట్ అయినప్పటికీ.. ఆడియన్స్ ఆశించిన పక్కా మాస్ కిక్ ఇవ్వలేకపోయామనే బాధ తనలో ఉండిపోయిందని, ఆ లోటును తుడిచేయడానికే ‘ది ప్యారడైజ్’ తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సినిమాలో నాని లుక్ మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత విచిత్రంగా ఉండబోతోంది. పోస్టర్‌లో నాని రెండు జడలతో కనిపించడం వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాన్ని శ్రీకాంత్ పంచుకున్నారు. చిన్నతనంలో తన తల్లి ప్రేమతో తనకు రెండు జడలు వేసేదని, ఆ చిన్ననాటి జ్ఞాపకం నుంచే ఈ ప్రత్యేకమైన గెటప్ కాన్సెప్ట్ పుట్టిందని వివరించారు. ఆదిలాబాద్ ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో పాటు గోదావరిఖని నేటివిటీ, సంస్కృతిని జోడించి పూర్తి స్థాయి రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా ఈ కథను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ‘ది ప్యారడైజ్’లో నానిని ఢీకొట్టే ప్రధాన విలన్‌గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్‌ను అత్యంత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇక సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, కథ విషయంలో ఎక్కడా రీషూట్లు చేయలేదని, అనుకున్న ప్లాన్ ప్రకారమే పక్కాగా సినిమాను ముందుకు తీసుకెళ్తున్నామని శ్రీకాంత్ ఓదెల తేల్చి చెప్పారు. ఈసారి బాక్సాఫీస్ వద్ద నాని – శ్రీకాంత్ ద్వయం మాస్ ప్రేక్షకులకు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతోందో చూడాలి.
