Site icon TeluguMirchi.com

Venky Kudumula: “నాగార్జున గారు తోడుండటమే మా మొదటి గెలుపు..”

Cinema

Venky Kudumula: సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల, తాజాగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్, అనశ్వర రాజన్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర గ్రాండ్ రివీల్ ఈవెంట్‌లో వెంకీ కుడుముల మాట్లాడిన మాటలు సినీ ప్రియుల హృదయాలను హత్తుకుంటున్నాయి. స్టార్‌డమ్ విలువను, అగ్ర కథానాయకుడు కింగ్ నాగార్జున ఔన్నత్యాన్ని వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. వేదికపై వెంకీ కుడుముల మాట్లాడుతూ.. “ఒక మనిషి స్టార్ అవ్వడం గొప్ప, ఆ స్టార్ తన లెగసీని కంటిన్యూ చేయడం ఇంకా గొప్ప.. కానీ ఆ స్టార్ తన చేతుల మీదుగా ఎంతోమంది కొత్త స్టార్లను క్రియేట్ చేయడం అన్నిటికంటే అత్యంత గొప్ప విషయం. ఆ లక్షణం ఒక్క నాగార్జున గారిలోనే ఉంది” అని కొనియాడారు.

కొత్త నిర్మాతలుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న తమ బృందానికి నాగార్జున అండగా నిలవడంపై వెంకీ కుడుముల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “ఇప్పటివరకు నాగార్జున గారి చేతుల మీదుగా చిత్ర పరిశ్రమకు ఎంతోమంది స్టార్ టెక్నీషియన్లు, దర్శకులు పరిచయమయ్యారు. ఇప్పుడు మా సినిమా కోసం ఆయన సమర్పకుడిగా ముందుకు రావడం మామూలు విషయం కాదు. మా ‘ఇట్లు అర్జున’ సాధించిన మొట్టమొదటి ఘన విజయం ఏంటంటే.. నాగార్జున గారు ఈ ప్రాజెక్ట్‌లోకి ఆన్ బోర్డ్ రావడమే! ఆయనకు ఎంత థాంక్స్ చెప్పినా చాలా తక్కువ.”

కొత్త ప్రతిభను గుర్తించి వెన్నుతట్టడంలో నాగార్జున ముందుంటారనే విషయాన్ని మరోసారి రుజువు చేశారని వెంకీ పేర్కొన్నారు. ‘ఇట్లు అర్జున’ కోసం పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రాజా ప్రతిభను రషెస్ చూసి మెచ్చుకోవడమే కాకుండా, తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన మైలురాయి చిత్రం ‘కింగ్ 100’కు డీవోపీగా ఎంపిక చేయడం తమ యూనిట్‌కే దక్కిన అతిపెద్ద గౌరవమని సంతోషం వ్యక్తం చేశారు. హీరో అనీష్, నిర్మాత మహేష్‌తో పాటు తనను ఒక కొత్త నిర్మాతగా ప్రోత్సహిస్తూ నాగార్జున అందించిన మద్దతు ఎప్పటికీ మర్చిపోలేనని, ఆయన ఇచ్చిన భరోసాతోనే సినిమా మరింత ఉత్సాహంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని వెంకీ కుడుముల స్పష్టం చేశారు.

Exit mobile version