
Kingdom : విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న “కింగ్‌డమ్” సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గౌతమ్ తిన్ననూరికి ఇది పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తొలి ప్రయత్నం కావడంతో, ఆయన ఈ శైలిని ఎలా హ్యాండిల్ చేస్తారన్న ఆసక్తి మొదటి నుంచీ ఉంది. అయితే విడుదలైన ప్రచార చిత్రాలతో గౌతమ్ స్టైల్ యాక్షన్ సీన్స్ ఎలా వుంటాయన్న దానిపై స్పష్టత వచ్చింది. యాక్షన్‌లోనూ హీరో విజయ్ దేవరకొండను అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.
ఈ సినిమా కథ 1947 తర్వాతి కాలం నాటి శ్రీలంక సరిహద్దు ప్రాంతంలోని శరణార్థుల నేపథ్యంలో సాగుతుంది. ఈ క్రమంలో అణగారిన వర్గాల కోసం పోరాడే నాయకుడిగా విజయ్ నటిస్తున్నాడు. ప్రచార చిత్రాలు కూడా ఈ కోణంలోనే ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.
ఇక రొమాన్స్ విషయంలో కూడా “కింగ్‌డమ్” ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఉందంటూ ఫిలిం వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ మధ్య భారీ రొమాంటిక్ ట్రాక్ ఉండబోతోందట. గౌతమ్ తిన్ననూరి పాత సినిమా “జెర్సీ”లో నాని-శ్రద్ధా శ్రీనాధ్ మధ్య రొమాన్స్ ఎంత బాగా వర్కౌట్ అయిందో తెలిసిందే. తిన్ననూరి ఎమోషనల్ టచ్‌తో పాటు రొమాంటిక్ ఎలిమెంట్స్‌కి మంచి స్కోప్ ఇచ్చే దర్శకుడు.
“జెర్సీ”లో నానికి ఓ కొత్త రొమాంటిక్ షేడ్ చూపించిన తిన్ననూరి, ఇప్పుడు విజయ్ దేవరకొండలోనూ అలాంటి కోణాన్ని తెరపై చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఈ నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా విజయ్ దేవరకొండకు మరో హిట్‌ను అందిస్తుందా? ప్రేక్షకుల మద్దతు పొందేలా గౌతమ్ రొమాన్స్+యాక్షన్ మేజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
